Reading Time: < 1 minute
Operation Trace 900 Children Rescued Says Ap Home Minister Vangalapudi Anitha

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను రక్షించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా 900 మంది పిల్లలను రక్షించామని వెల్లడించారు.. విశాఖపట్నంలో మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం-1976పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత, రాష్ట్రంలో చట్టాలు మరియు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని చెప్పారు.

పోక్సో కేసుల్లో కఠిన చర్యలు
POCSO Act కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు వంగలపూడి అనిత… కొన్నిచోట్ల నిందితులకు బెయిల్ రాకముందే శిక్షలు పడుతున్నాయని చెప్పారు. ఆపరేషన్ ట్రేస్‌తో పాటు, వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన 180 మందిని కూడా సురక్షితంగా రక్షించామని మంత్రి వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమర్థ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం, బలవంతపు కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు మరింత వేగవంతం చేస్తామని చెప్పారు.