Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాదర్‌గుల్ భూముల విషయంలో హరీశ్ దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి అన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హరీశ్‌రావు, బిఆర్ఎస్ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. సర్వే నంబర్.613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని.. భూముల మ్యుటేషన్ 2016లో జరిగినప్పుడు కూడా బిఆర్‌ఎస్‌యే అధికారంలో ఉందని తెలిపారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.

‘‘హరీశ్‌రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారు. భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వట్లేదని 2022లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాళ్లు కోర్టుకు వెళ్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మం కౌంటర్ వేశాం. ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి ఇలాళ మా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాదల్‌గుల్ వాటా రాకపోవడంతో హరీశ్ రావు ఇవాళ తెరపైకి తెచ్చారు. ప్రొహిబిటెడ్ భూముల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు లేరు. నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేస్తున్న. వట్టి నాగులపల్లి భూముల్లోనే హరీశ్ రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారు’’ అని పొంగులేటి విరుచుకుపడ్డారు.