Reading Time: < 1 minute

గౌహతి: ఐపిఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ యువ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ మరోసారి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాను సైతం లెక్క చేయలేదు. ఏమాత్రం బెదరకుండా భారీ సిక్సులతో స్టేడియంలో మెరుపులు మెరిపించాడు. కేవలం 14 బంతుల్లోనే ఒక ఫోర్, ఐదు సిక్సులతో 39 పరుగులు చేసి రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

ఈ క్రమంలో 15ఏళ్ల ఈ చిచ్చరపిడుగు.. టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. 20 ఏళ్లు నిండకముందే ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. కిషన్, పంత్‌లు చెరో 30 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఇప్పటికే 35 సిక్సర్లు బాదాడు. 20 ఏళ్లు నిండడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉండటంతో సూర్యవంశీ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(39), యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో అజేయంగా 77 పరుగులు) రాణించారు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబైపై రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది.