
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హార్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడంతో ఇరాన్.. హార్ముజ్ ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో హార్ముజ్ ను ఓపెన్ చేయాలంటూ అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. అయితే, హార్ముజ్ ను పూర్తిగా మూసివేయకుండా తమ మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది.
తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్.. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో భారత్‌తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై దిగ్బంధనం విధించబోమని ప్రకటించింది. భారత్‌తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్‌లకు చెందిన నౌకలను హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది.
హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడలేదని, ఇరాన్‌తో మిత్ర సంబంధాలున్న పలు దేశాలకు చెందిన నౌకల ప్రయాణానికి అనుమతించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. “పలు దేశాలు మమ్మల్ని సంప్రదించి, హార్ముజ్ జలసంధి గుండా తమ నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతించాలని అభ్యర్థించాయి. మిత్ర దేశాలుగా భావించే కొన్ని దేశాలకు హార్ముజ్ తెరిచేందుకు నిర్ణయించుకున్న సందర్భాలలో, మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి” అని తెలిపారు.