
మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడలో సంచలనం సృష్టించిన దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కే సులో కీలక నిందితురాలిగా భావిస్తున్న హైదరాబాద్ చంచల్ గూడలోని సైదా బేగం నివాసంలో పోలీసులు బుధవారం ఉదయం ముమ్మర సోదాలు నిర్వహించారు. 41-ఎ నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా సైదా బేగం కదలికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పో లీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రలింకులో నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. సైదా బేగం గు రించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సైదా బేగం స్వస్థలం మహారాష్ట్ర లోని సోలాపూర్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్‌లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఇదే కేసులో కర్ణాటక బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విషయం విదితమే.
ముగ్గురు నిందితులు అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఎక్యూఐఎస్), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లతో సంబంధం ఉన్న విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ, దేశ వ్యతిరేక లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు. యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారిని జిహాద్‌కు సిద్ధం చేయడం, దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం అనే లక్ష్యంతో ఈ ముగ్గురూ అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఎక్యూఐఎస్, ఐఎస్‌ఐఎస్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కనుగొంది. ఈ ముగ్గురూ గజ్వా-ఎ-హింద్(భారతదేశంపై యుద్ధం) అనే భావన కోసం పనిచేస్తున్నారని, వివిధ ప్రాంతాలలోని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తమ నెట్‌వర్క్‌ను పలు రాష్ట్రాలకు విస్తరించారని ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం ధృవీకరించినట్లు తెలిసింది.
సోషల్ మీడియా ప్రభావంపై పోలీసుల ప్రత్యేక నజర్
సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసుల అదుపులో మరో ఏడుగురు…?
పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు 9 ప్రత్యేక బృందాలను పంపి, ఆయా ప్రాంతాల్లో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉండి కార్యకలాపాలు నడిపిస్తున్న ఏ6 ఆల్ హకీమ్ షుకూర్ (హ్యాండ్లర్)తో పాటు బీహార్‌కు చెందిన దిల్ఖాష్ (ఏ4), అస్మాను ల్లా ఖాన్ (ఎ8), ఢిల్లీకి చెందిన లక్కీ అహమ్మద్ (ఎ7), రాజస్థాన్‌కు చెందిన జిషణ్ (ఎ9), పశ్చిమ బెంగాల్‌కు చెందిన మీరా ఆసిఫ్ అలీ (ఎ10), మహారాష్ట్రకు చెందిన షారుక్ ఖాన్ (ఏ12), షేక్ ఫీజర్ రెహమాన్ (ఏ13)లను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక పోలీసుల సహకారంతో లోతుగా విచారిస్తున్నారు.