Reading Time: 2 minutes

 ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో బాధపడుతున్న దేశంగా పాకిస్థాన్ తొలి స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్, తజికిస్తాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన గాలి నాణ్యత సాంకేతిక సంస్థ ‘ఐక్యూఏయిర్’ విడుదల చేసిన 2025 ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక 143 దేశాలు, ప్రాంతాలు, భూభాగాల్లోని 9,446 నగరాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కు పైగా మానిటరింగ్ స్టేషన్లు, తక్కువ ఖర్చు సెన్సర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పౌర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కాలుష్య దేశాల జాబితాలో చైనా 20వ స్థానంలో ఉండగా, అమెరికా 120వ స్థానంలో, యునైటెడ్ కింగ్‌డమ్ 110వ స్థానంలో ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన వార్షిక సగటు పీయం2.5 ప్రమాణాలను కేవలం 13 దేశాలు లేదా ప్రాంతాలు మాత్రమే పాటించగలిగినట్లు నివేదిక పేర్కొంది. ఫ్రెంచ్ పోలినీషియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులు, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్లాండ్, బెర్ముడా, రీయూనియన్, ఆండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పానామా, ఎస్టోనియా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో 130 దేశాలు (91 శాతం) డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన పీయం2.5 పరిమితులను మించాయని నివేదిక స్పష్టం చేసింది. అత్యంత కాలుష్య దేశాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, తజికిస్తాన్, చాద్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో ఉన్న 25 నగరాలు భారత్, పాకిస్థాన్, చైనా దేశాల్లోనే ఉండగా, అత్యధికంగా భారత్‌లోనే ఉన్నట్లు నివేదిక తెలిపింది. అత్యంత పరిశుభ్రమైన నగరంగా దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్‌విల్ నిలిచింది.

నగరాల వారీగా ఉత్తరప్రదేశ్‌లోని లోనీ అత్యంత కాలుష్య నగరంగా నిలవగా, చైనాలోని హోటాన్, మేఘాలయ రాష్ట్రంలోని బైర్నిహాట్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ ఐదో స్థానంలో ఉంది. 2025లో అటవీ అగ్నిప్రమాదాలు గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. గతంలో తక్కువ కాలుష్య స్థాయులు ఉన్న ప్రాంతాల్లో కూడా పీయం2.5 స్థాయిలు పెరిగాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం నగరాలు మాత్రమే డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను అందుకోగలిగాయి. 2024లో ఇది 17 శాతంగా ఉండటం గమనార్హం.