Reading Time: < 1 minute

ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు కంధమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డిజిపి వైబి ఖురానియా తెలిపారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడైన శుక్రు ఏకే-47 రైఫిల్‌తో లొంగిపోయినట్టు చెప్పారు. శుక్రుపై రూ.55 లక్షల రివార్డు కూడా ఉంది. మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన శుక్రు కెకెబిఎన్ డివిజన్ పేరిట కొత్తగా దళాన్ని ఏర్పాటు చేసి కంధమాల్ జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం గడువు విధించిన నేపథ్యంలో తాజా లొంగబాటు చోటు చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు జిల్లాల్లో గాలింపు చర్యలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు.