
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక డిస్కౌంట్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు.
“ఇది కేవలం సబ్సిడీ మాత్రమే కాదు. మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రావ్టన్ మోటార్స్ వంటి కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం. ఇప్పటికే 100శాతం రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది. ఇకపై ప్రభుత్వ అవసరాల కోసం కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగిస్తాం. పరిశుభ్రమైన గాలి, తక్కువ ఇంధన ఖర్చులు, భవిష్యత్తు అవసరాల కోసం మెరుగైన సేవలు అందించాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.