
మన తెలంగాణ/హైదరాబాద్: కో ర్టు ధిక్కరణ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప దవి విరమణ చేసిన ఉద్యోగు ల బకాయిలు ఏప్రిల్ 9లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన ఫైనాన్స్ సెక్రటరీపై తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రెటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూ డా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించా రు. దీంతో సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం పిటిషన్లు విచారించింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలను చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను రా ష్ట్ర ప్రభుత్వం పాటించడంలో విఫలమవడంతో ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుండి మి నహాయింపు ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్లీడర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రా జేశ్వరరావు తిరస్కరించారు. దీంతో వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నూ సోమవారం విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది.
అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటామని, వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఫైనాన్స్ సెక్రటరీ సాయంత్రం ఆన్‌లైన్‌లో కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న విపరీతమైన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తమ డబ్బు అందక తీవ్ర మనోవేదనకు గురై 80 మందికి పైగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు పట్టుబడితే, ప్రభుత్వం తన ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి, మార్చి 31 నాటికి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లిస్తుందని ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఈ బకాయిలను చెల్లించడానికి మరో 30 రోజుల గడువు ఇస్తే ప్రభుత్వానికి మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3,656 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు నమోదై ఉన్నాయని ఆర్థిక కార్యదర్శి సుల్తానియా కోర్టుకు తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు 1,056 మంది ఉద్యోగుల బకాయిలను చెల్లించిందని, ప్రస్తుతం మరో 2,600 మంది ఉద్యోగుల బకాయిల చెల్లింపు పెండింగ్‌లో ఉందని ఆయన వివరించారు. బకాయిల చెల్లింపు కోసం ఆర్థిక కార్యదర్శి కోరినట్లుగా 30 రోజుల గడువు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, ప్రభుత్వం పదవీ విరమణ బకాయిలను చెల్లించడానికి ఏప్రిల్ 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేదంటే, ఈ కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆర్థిక కార్యదర్శి స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి కట్టుబడి ఉంటామని ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. అది వారి సొంత డబ్బని, ఏప్రిల్ 9వ తేదీలోగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ శుభవార్తను తెలియజేయండి, అని న్యాయమూర్తి రావు ఆదేశించారు. కాగా, గత రెండేళ్లుగా వేలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, జిపిఎఫ్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి తమ పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందిస్తూ, బకాయిలను ఆరు నుంచి పది వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్థిక కార్యదర్శితో సహా ప్రభుత్వ ప్రతినిధులపై కోర్టు ధిక్కార చట్టం నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ ప్రతినిధులకు ధిక్కార నోటీసులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి గడువు కోరుతూ వాయిదాలు అడుగుతూనే ఉన్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆదేశాలను పాటించకపోవడం, అలాగే ధిక్కార నోటీసులకు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, గత విచారణ సందర్భంగా ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన వైఫల్యంపై వివరణ ఇవ్వడానికి, ఆయన స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.