
దేశానికి సుమారు ఒకరోజుకుర సరిపడా వంటగ్యాస్‌ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు, యుద్ధ వల్ల దెబ్బతిన్న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ‘పైన్ గ్యాస్, జగ్ వసంత్’ అనే ఈ ఎల్పీజీ ట్యాంకర్లు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరి, పరస్పరం సమీపంగా ప్రయాణిస్తూ హార్మూజ్ జలసంధిని దాటాయి. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలు గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు చేరేందుకు సాధారణంగా రెండు నుంచి రెండున్నర రోజులు పడుతుందని తెలిపారు.
ఈ ట్యాంకర్లు ఇరాన్‌కు చెందిన లారాక్ మరియు క్వేశ్మ్ దీవుల మధ్యగా ప్రయాణించాయి. హార్మూజ్ జలసంధిని దాటే ముందు ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును స్పష్టంగా తెలియజేయడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి దాదాపు మూసివేయబడటంతో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన 22 భారత జెండా నౌకల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ‘ఎంటీ శివాలిక్’, ‘ఎంటీ నందా దేవి’ అనే ట్యాంకర్లు సుమారు 92,712 టన్నుల ఎల్పీజీతో సురక్షితంగా భారత తీరాలకు చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు మొత్తం 28 భారత జెండా నౌకలు హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్నాయి. వాటిలో 24 నౌకలు పశ్చిమ భాగంలో, నాలుగు తూర్పు భాగంలో ఉన్నాయి.
గత కొన్ని రోజుల్లో రెండు వైపుల నుంచి రెండు నౌకలు చొప్పున సురక్షితంగా బయటపడ్డాయి. ‘శివాలిక్’ నౌక మార్చి 16న గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేరగా, ‘నందా దేవి’ మరుసటి రోజు కాండ్లా పోర్టుకు చేరింది. మరో రెండు ఎల్పీజీ నౌకలు మార్చి 13న ప్రయాణం ప్రారంభించి, మార్చి 14న హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇక యూఏఈ నుంచి 80,886 టన్నుల క్రూడ్ ఆయిల్ తీసుకువచ్చిన ‘జగ్ లాడ్కీ’ నౌక మార్చి 18న ముండ్రాకు చేరింది. అలాగే ఒమన్ నుంచి ఆఫ్రికాకు పెట్రోలు తీసుకెళ్తున్న ‘జగ్ ప్రకాష్’ ట్యాంకర్ కూడా ముందుగా సురక్షితంగా జలసంధిని దాటి ప్రస్తుతం టాంజానియాకు వెళ్తోంది. ఇంకా యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఉన్న 24 భారత జెండా నౌకల్లో, 22 నౌకలు పశ్చిమ భాగంలో 611 మంది సిబ్బందితో ఉన్నాయి. మిగిలిన రెండు నౌకలు తూర్పు భాగంలో కొనసాగుతున్నాయి.