
మన తెలంగాణ షాదనగర్: అక్రమ సంబంధంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాదనగర్ డిజిపి శిరీష సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామపంచాయతీ రంగారెడ్డిగూడకు చెందిన పోతుల శోభారాణి (30) మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం కొన్నేండ్ల పాటు సాఫీగా సాగింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో శోభారాణికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం భర్త రాజును వదిలేసి శోభారాణి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. అప్పటి నుంచి నర్సింహులు శోభారాణిని పెళ్లి చేసుకుంటానని కుల పెద్దలు, భర్తతో మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త రాజు శోభారాణిని శనివారం రాత్రి అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డిగూడ- తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేశాడు. ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు వెళ్తుండగా తల్లి శవం వద్ద రోదిస్తూ మూడేళ్ల చిన్నారి గమనించి గ్రామ సర్పంచ్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రంతా తల్లి శవం వద్ద వద్ద చిన్నారి రోదనలతో గడపడం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. హత్య ఘటనపై పట్టణ సిఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.