
ఖాళీగా ఉన్న మంత్రి పదవుల
భర్తీతో పాటు కేబినెట్‌లో
మార్పులపై కాంగ్రెస్‌లో
ఉత్కంఠ అసెంబ్లీ బడ్జెట్
సమావేశాల తరువాత
ముహూర్తం ఇద్దరిపై
వేటు వేసే అవకాశం అదే
సామాజికవర్గాలతో తిరిగి భర్తీ
చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్
పదవులకూ నియామకాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మం త్రివర్గ విస్తరణపై కొందరు ఎమ్మెల్యేలు ఆశ లు పెట్టుకోగా, కేబినెట్ విస్తరణ కంటే ప్రక్షాళన పేరు వింటేనే కొందరు మంత్రులు భ యపడుతున్నట్టుగా సమాచారం. కొత్తగా మంత్రివర్గంలో వచ్చేది ఎవరూ? పోయేది ఎవరన్న దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జోరు గా చర్చ మొదలయ్యింది. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటడం, ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల పైచిలుకు మిగిలి ఉండడంతో మిగిలిన రెండు మంత్రి పదవులను భర్తీ చేసి, పనితీరు మార్చుకోని మంత్రులను తప్పించి, మరికొందరు మంత్రుల శాఖలను మార్చాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే, పదవుల భర్తీ లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వాటిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసిం ది. ఎవరిని తొలగిస్తున్నారో అదే సామాజిక వర్గ నేతతో మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్టుగా సమాచారం. దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసింది.
సీడబ్ల్యూసీ, ఏఐసిసి పదవులు
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి హైకమాండ్‌తో పలుమార్లు చర్చించడంతో అధిష్టానం మార్పులు, చేర్పులపై కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రుల్లో ఇద్దరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. తప్పించిన ఇద్దరికి పార్టీ పదవులు (సీడబ్ల్యూసీ, ఏఐసిసి) పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయా మంత్రులకు ఇప్పటికే పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చిందని, దీనికి సంబంధించి ఆ నేతలు కూడా సానుకూలంగా అంగీకరించినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఈ మంత్రివర్గ విస్తరణలో చాన్స్ దక్కుతుందని, అందులో భాగంగానే కూడికలు, తీసివేతలు ఉంటాయని, మరికొందరి శాఖల్లో పదోన్నతులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్ భవితవ్యంపై గందరగోళం నెలకొనడంతో ఈ విషయమై త్వరలో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు ఆయా జిల్లాల ప్రాతినిథ్యం, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టుగా సమాచారం. కేబినెట్ విస్తరణపై పార్టీలో అంతర్గత వివాదాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం పక్కాగా ప్రణాళికలు వేసిందని తప్పించిన మంత్రుల స్థానాలను అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేస్తేనే తగిన న్యాయం జరుగుతుందని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక, మంత్రివర్గ విస్తరణలో బిసి, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది. బిసిల్లో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న మున్నూరు కాపులు, ఎస్టీల్లో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.
చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు సైతం
కేబినెట్‌లో మార్పుల సందర్భంగానే చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ, మండలి విప్‌ల నియామకాలు ఇటీవలే చేపట్టినా చీఫ్ విప్ నియామకాలను మాత్రం వాయిదా వేసినట్లుగా చర్చ జరుగుతోంది. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులకు కేబినెట్ హోదా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా వాటిని కూడా భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగు తోంది. మంత్రి పదవి రాని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టు గతేడాది జూన్‌లో ప్రకటించినా ఆయన ఈ పదవిపై అయిష్టత వ్యక్తం చేయడంతో ఆయనకు మంత్రి ఇస్తారా లేదా అన్న త్వరలోనే తేలనుంది. దీంతోపాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, వీరితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీనియర్‌లకు మున్సిపల్, విద్యా శాఖలు
చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి ఇవ్వాలని లాబీయింగ్ చేస్తుండగా, ఎక్కడ తమ పదవులు పోతా యోనని ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సిఎం వద్ద మున్సిపల్, విద్యా, హోంశాఖలు ఉన్నాయి. మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకొని సిఎం దగ్గర విద్యా, మున్సిపల్, హోంశాఖలను సీనియర్‌లకు కేటాయించి సీనియర్‌ల దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జీహెచ్‌ఎంసి ఎన్నికలు జూలై లోపు ఉండే అవకాశం ఉండడంతో ఆలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.