Reading Time: < 1 minute

బాల్కనీ స్లాబ్ కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలో చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసుల వివరాల ప్రకారం..  మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌ యజమాని ద్వారకా ప్రసాద్.. విద్యుత్ పనుల నిమిత్తం ఇద్దరు కూలీలను తన నివాసానికి పిలిపించాడు.

మూడో అంతస్తుకు తీసుకెళ్లి పనుల గురించి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు కిందపోయారు. స్లాబ్ శిథిలాలు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడిన కూలీ వర్కర్లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యజమాని ద్వారకా ప్రసాద్ కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (56), వివేక్ (32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.