
దోహ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాంతీయ జలాల్లో ఓ ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గల్లంతయ్యాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
హెలికాప్టర్ ప్రమాదానికి “సాంకేతిక లోపమే” కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. “సాధారణ విధి నిర్వహణలో ఉన్న ఖతార్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, అది దేశ ప్రాంతీయ జలాల్లో కూలిపోయింది” అని Xలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.