
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2026- 27 భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత, రైతు లు, బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోపాటు విద్య, ఆరోగ్య, పరిశ్రమల ప్రగతికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అంకెల గారడీ కాకుండా ప్రజల స్థితిగతుల మెరుగుకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రకటించిన ప్రభుత్వం ఈసారి రూ. 3,24,234 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో రూ. 2,34,406 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు. దేశ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటే, రాష్ట్ర వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి నిదర్శనం. తలసరి ఆదాయంలో దేశం సగటు 6.9 శాతం కాగా, రాష్ట్ర సగటు 10.2 శాతం కావడం తెలంగాణకు గర్వకారణం. దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి 5 శాతం వాటా కలిగి ఉండటం దేశ ప్రగతిలో రాష్ట్రం అందిస్తున్న భాగస్వామ్యానికి నిదర్శనం.
ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్‌కు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని ఈ బడ్జెట్ నిరూపిస్తోంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్బావం దినోత్సవం జూన్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడంతో ప్రజల్లో భరోసా కలుగుతోంది. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందదాయకం. రాష్ట్రంలో విద్యావికాసానికి ప్రాధాన్యతిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ, చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడం స్వాగతించాల్సిన అంశం.
మహిళా సాధికారితకు కట్టుబడిన ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి రూ. 3143 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 269 కోట్ల జీరో టికెట్లు ఇవ్వడంతో వారు రూ. 9222 కోట్లు ఆదా చేసుకున్నారు. రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 53.09 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద రూ. 3900 కోట్లు ఖర్చు చేసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో 3.38 కోట్ల మంది ఉచిత సన్నబియ్యంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు రూ. 7366 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 3,24,536 ఇళ్లు మంజూరు చేయగా, 2,62,449 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ. 7430 కోట్ల ప్రతిపాదనతో పేదలకు ఇళ్లు వేగవంతంగా అందుతాయి.
తెలంగాణలో కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పేద, బడగు, బలహీన, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో బడుగు వర్గాలకు న్యాయం చేసింది. ఎస్‌సి సంక్షేమానికి రూ. 11,784 కోట్లు, ఎస్‌టి సంక్షేమానికి రూ. 7937 కోట్లు, బిసి సంక్షేమానికి రూ. 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3769 కోట్లు కేటాయించింది. రాబోయే గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు, పర్యాటక శాఖకు రూ. 1,224 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అన్ని శాఖలకు సమ ప్రాధాన్యతిచ్చినట్టయ్యింది. విద్యా వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం విద్యా శాఖకు రూ. 26,674 కోట్లు కేటాయించింది. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు చేయగా, 44 చోట్ల పనులు కూడా ప్రారంభమయినట్టు బడ్జెట్‌లో ప్రకటించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 400 కోట్లు కేటాయించారు. నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించనున్న ప్రభుత్వం బడ్జెట్‌ల్లో వైద్య, ఆరోగ్య శాఖకి రూ. 13,679 కోట్లు కేటయించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ. 33,688 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గత కెసిఆర్ సర్కారు అసంపూర్తిగా మిగిల్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం నీటి పారుదల శాఖకు రూ. 22,615 కోట్లు కేటాయించింది. అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతిస్తోంది. వ్యవసాయానికి రూ. 23,179 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 1529 కోట్లు కేటాయించారు. రికార్డు స్థాయిలో తక్కువ వ్యవధిలో రూ. 2 లక్షల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ. 20,616 రుణ విముక్తి కల్పించింది.
గత సీజన్‌లో 67 లక్షలకుపైగా రైతులకు సంబంధించి 138 లక్షల ఎకరాలకు పైగా భూములకు రూ. 8,284.66 కోట్ల రైతు భరోసా చెల్లించిన ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌కు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను గత బిఆర్‌ఎస్ పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారు. గత కెసిఆర్ ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన రూ. 25,612 కోట్ల రుణాలను సిఎం రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృషితో తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు, ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిబద్ధతను చాటుకుంది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఇందిరమ్మ రాజ్యం దిశగా బడ్జెట్ సమర్పించింది.
– మహేశ్ కుమార్ గౌడ్
(ఎంఎల్‌సి, టిపిసిసి అధ్యక్షులు)