
కేంద్ర ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి గాను జరిపిన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాల జాబితాలో మొట్టమొదటగా నిలిచేది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నగరానికి చుట్టుకుని ఉన్న పూర్వపు రంగారెడ్డి జిల్లా దేశంలోనే మహా నగరాలైన బెంగళూరు, నోయిడా, సోలన్, గోవా, ముంబై, అహ్మదాబాద్ వంటి అత్యంత సంపన్న నగరాలను, జిల్లాలను వెనక్కి నెట్టేసి ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలోనే రంగారెడ్డి జిల్లాకు ఈ ఖ్యాతి దక్కడం ఆ జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణం. ఒకప్పుడు హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని వేరుచేసి 1978లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ రాజకీయవేత్త కొండ వెంకట రంగారెడ్డి పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసే కాలం నాటికి ఈ ప్రాంతమంతా వ్యవసాయ భూములు. ఎక్కువగా కూరగాయలు, పళ్ళు పండించే ప్రాంతం. ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. అక్కడ పండించిన కూరగాయలు, పళ్ళు హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగించే పేద, మధ్యతరగతి రైతులే ఎక్కువమంది. కొద్దిమంది వేళ్ళమీద లెక్కించదగ్గ సంఖ్య లో, ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే, సంపన్న భూస్వాములు ఉండవచ్చు. కానీ మొత్తంగా సగటు జీవన స్థితిగతులున్న ప్రజలే ఎక్కువగా ఉండేవారు.
తర్వాత కాలంలో బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్‌కి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా వైపుకి నగరం విస్తరించిన కారణంగా, అట్లాగే కాలక్రమంలో పెద్ద ఎత్తున ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ విస్తరించిన కారణంగా, వాటికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇదే జిల్లాలో ఏర్పాటైన కారణంగా, ఇంకా ఔటర్‌రింగ్ రోడ్డు ఏర్పడిన కారణంగా ఆ జిల్లా దశ పూర్తిగా తిరిగింది. అట్లా ఇప్పుడు అది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దేశంలోనే మొట్టమొదటి సంపన్న జిల్లాగా ప్రసిద్ధికెక్కింది. రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన పథక రచనలో భాగంగా ఆ జిల్లాభూభాగం లోనే ఫ్యూచర్ సిటీ ఏర్పడినట్లయితే ఇక రంగారెడ్డి జిల్లాను అందుకునే పరిస్థితి దేశంలోని ఏ ప్రాంతానికీ ఉండదు. 202425 ఆర్థిక సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జిడిపి 11.46 లక్షల. ఇది దేశంలోని ఇంకే ఇతర నగరాల్లో కూడా లేని ఆదాయం. ఇంతకుఇంత సంపన్నమైన జిల్లాలో పేదరికం లేదా అంటే దానికి ఏం కొదువ లేదు, కానీ హైదరాబాద్ మహానగరానికి చేరువగా ఉన్నందున పని చేసుకుని బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా గురించి ఎందుకు ఇంత మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా వచ్చిన కీర్తి మాత్రమే కాదు మరొక అపకీర్తిని కూడా మూటగట్టుకుని జాతీయస్థాయిలో వార్తల కెక్కుతుండటం దురదృష్టకరం.
నగరం విస్తరిస్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా అంతటా పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన ఫామ్ హౌస్‌లు. నడ మంత్రపు సిరితో ఒళ్ళు తెలియకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నవాళ్లు చేస్తున్న వికృత చేష్టలు పెరిగాయి. వీరు వారు అని లేకుండా అనేకమంది వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతర సంపన్న వర్గాలవారు నగర శివారులలోని ఈ ప్రాంతాల్లో పెద్దపెద్ద ఫామ్ హౌస్‌లు నిర్మించుకొన్న విషయం తెలిసిందే. వరుసగా ఐదు రోజులు తీవ్రమైన పని ఒత్తిడి తరువాత వారాంతంలో రెండురోజులు ప్రశాంతంగా నగర రణగొణ ధ్వని నుండి సేద తీరడానికి ఈ ఫామ్ హౌస్‌లను ఆశ్రయించే వారితో పేచీ లేదు. అటువంటి అనేకమందిని మనం దైనందిన జీవితంలో కలుస్తూ ఉంటాం. కొందరు అవకాశం దొరికినప్పుడు సమూహాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. మనశ్శాంతి కోసం కుటుంబంతో ప్రత్యేకంగా గడపడం కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు చర్చ వాళ్ళని గురించి కాదు, గతవారం జరిగిన ఒక సంఘటన గురించి. ఇది మొదటిసారి జరగలేదు. దాదాపు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్‌లో ఈగల్ టీంకు సంబంధించిన పోలీసులు పక్కా సమాచారం మేరకు దాడి చేసి కొంతమందిని పట్టుకొని పరీక్ష చేస్తే వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అట్లా డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన వాళ్లలో రోహిత్‌రెడ్డి తోపాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారపక్షం లోకసభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ ఆరుగురిని పోలీసులు చట్టానికి అప్పగిస్తే పార్లమెంట్ సభ్యుడు మహేష్ యాదవ్ మాత్రం స్టేషన్ బెయిల్‌పై విడుదలై నేరుగా ఢిల్లీ వెళ్లి లోకసభలో కూర్చున్నారు. బహుశా అప్పటికి ఇంకా ఆయన ఆ డ్రగ్ ప్రభావంనుంచి బయట కూడా పడి ఉండరు. ఎందుకంటే వాళ్లు తీసుకున్న డ్రగ్స్ మామూలు గంజాయి కాదు కొకై న్, ఎండిఎంఎ, మెథొఇథిపిన్ వంటి శక్తివంతమైన మాదకద్రవ్యాలు. వీటిని సిమ్లాలోని ఒక గుర్తు తెలియని వ్యక్తినుంచి కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డికి ఇప్పటికీ 24 సార్లు డ్రగ్ సరఫరా చేసారంటున్న అభిషేక్ సింగ్‌ను పోలీసులు శనివారం నాడు పట్టుకున్నారు. రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ఈ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రోహిత్ రెడ్డికి ఇస్తూ ఉండేవాడని పోలీసుల కథనం
ఈ సంఘటన జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోకసభ సభ్యుడు దొరకడం, ఆయనను చాలా మామూలుగా స్టేషన్ బెయిల్‌మీద పంపించేయడం, ఆయన వెళ్లి లోకసభ సమావేశాల్లో పాల్గొనడం. ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దే సాయి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక ట్వీట్‌లో ఇట్లా జరగడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోకసభ సభ్యుడైతే మాత్రం అట్లా వదిలేస్తారా, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదు అన్న మన ప్రభుత్వాల గంభీరోపన్యాసాల (జీరో టాలరెన్స్) మాట ఏమిటి అని ప్రశ్నించారాయన. ఒకసారి రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ పరిస్థితిని చర్చించడం అట్లా ఉంచి ఈ లోకసభ సభ్యుడి గురించి, ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి లోకసభ పంపిన పార్టీ గురించి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్నది. ఆయనే ఆ రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా. తన పార్టీ ఎంపి డ్రగ్స్ తీసుకొని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతే అంత సీనియర్ నాయకుడు ఏం చేయాలి? వెంటనే ఆ ఎంపిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చెయించాలి.
ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం అనేది స్టేషన్ బెయిల్ ఇచ్చేంత మామూలు నేరం కాదు, ఈ దేశంలో మాదకద్రవ్యాల వినియోగం అనేది నిషేధం. అట్లాంటి నిషేధాలు విధించే నిర్ణయాలు తీసుకునే చట్టసభలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీ చేయాల్సిన పనేమిటి? తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఆ లోకసభ సభ్యుడిని కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంచాలని నిర్ణయించింది. ఒక సంజాయిషీ నోటీసు కూడా ఇచ్చినట్టు ఉన్నది.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం శిక్ష ఎట్లా అవుతుంది, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామి జనసేన పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే, బాధితురాలు దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడితే కూడా ఆ శాసనసభ్యుడిని కూడా కొంతకాలం జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిందట. మన దేశంలో రాజకీయ పార్టీలు విచిత్రమైన కొత్త కొత్త శిక్షల్ని కనుగొంటున్నాయి.
సరే ఇంకా కొంచెం లోతుకు వెళితే ఈ లోకసభ సభ్యుడు మహేష్ యాదవ్ తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు. ఈయనకు కూతురిని ఇచ్చిన మామ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించిన వారు. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఎంపికి బంధువే. రాజకీయంగా ఇంత అనుభవం కలిగిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, తాను స్వయంగా ఒక చట్టసభలో బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉండి ఫాం హౌస్‌లలో డ్రగ్స్ తీసుకోవలసిన అవసరం ఏమి వచ్చింది? పొరుగు రాష్ట్ర లోకసభ సభ్యుడికి తెలంగాణ పార్టీకి సంబంధించిన మాజీ సభ్యుడితో ఫార్మ్‌హౌస్‌లో జరపాల్సిన మంతనాలు ఏం ఉంటాయి, విందు వినోదాల కోసమే వెళితే తుపాకీ ఎందుకు పేలింది? ఇక పైలట్ రోహిత్‌రెడ్డి విషయానికొస్తే ఆయనకు న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆయన పార్టీ మాత్రం ఏడు రోజుల్లోనే సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నోటీస్ ఇచ్చిందట.
14 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ లభిస్తే బయటికి వచ్చి కదా సంజాయిషీ ఇవ్వగలుగుతాడు, లోపల ఉండి ఏ విధంగా ఇస్తాడు? డ్రగ్స్ తీసుకు న్నట్టు పరీక్షల్లో బయటపడ్డ తర్వాత ఇంకా సంజాయిషీ నోటీసులు, బాబ్బాబు నువ్వేం చెప్పదలుచుకున్నావు అని గడ్డం పట్టుకుని బతిమాలడాలు రాజకీయ పార్టీల ప్రతిష్టకు తగని పని. ఇదే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ గతంలో కూడా వార్తల్లోకెక్కింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో ఢిల్లీ నుండి వచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలు కొందరు భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులను కొనుగోలు చేయడానికి ఇక్కడే మంతనాలు జరుపుతూ దొరికిపోయిన వార్తలు విన్నాం. బహుశా అక్కడి నుండే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితికి మధ్య సంబంధాలు చెడిపోవడం మొదలైనట్టుంది.
పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ కొందరు దొరికిపోవడాన్ని చెదురుమదురు సంఘటనగా చూడటానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్‌పై పలు సందర్భాలలో డ్రగ్స్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు, పోలీసులు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నా అవి విరివిగా అందుబాటులో వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పబ్బులు, నగర శివారులోని ఫామ్ హౌస్ లూ ఈ డ్రగ్స్ పార్టీలకు అడ్డగా మారుతున్నాయి. దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నది, జీవితాలు నాశనం చేసుకుంటున్నది యువత. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో కూడా డ్రగ్స్ మహమ్మారి ప్రవేశించి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా వాటికి బానిసలను చేస్తున్న తీవ్ర ఆందోళనకరమయిన వార్తలు గతంలో మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఎంత కఠినమైన చట్టాలు చేసినా, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమవుతున్నది అన్న ప్రశ్న తలెత్తుతున్నది. క్షేత్రస్థాయిలో చట్టాల అమలు కఠినంగా ఎందుకు జరగడం లేదు.
ఒకప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపే వారి కారణంగా జరిగే ప్రమాదాల సంఖ్య, మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇవాళ నిజానికి హైదరాబాదులో ఈ సంఘటనలు దాదాపుగా లేవని చెప్పాలి. దానికి కారకుడు ఐపిఎస్ అధికారి సివి ఆనంద్. దేశంలో మద్యం మీద నిషేధం లేకపోయినా మద్యం సేవించి వాహనాలు నడిపితే పట్టుకొని కేసులు పెట్టే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆయనే. అది హైదరాబాద్ నగరం నుంచి పాకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విస్తరించింది. బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది అమల్లో ఉంటే ఉండొచ్చు. హైదరాబాదులో ఆనాడు సివి ఆనంద్ అంత కఠినంగా వ్యవహరించి ఉండకపోతే, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కఠినమైన నేరంగా పరిగణించి ఉండకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. డ్రగ్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంతే నిర్దాక్షిణ్యంగా, ఇంకా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవలసి ఉంటుంది.
ఈ దేశంలో డ్రగ్స్ నిషేధం, దానికి సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి, వాటిని కచ్చితంగా అమలు చేసి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే అనే వాతావరణం ఏర్పడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. డ్రగ్స్ బెడద నిర్మూలించేందుకు తీవ్రంగా ప్రయత్నించి, నేరస్తుల వెన్నులో చలి పుట్టించిన మరో అధికారి అకున్ సబర్వాల్. ఆనాటి ప్రభుత్వం ఆయనను హటాత్తుగా ఆ పని నుండి తప్పించేసింది, ఏ ఒత్తిడి ఫలితంగా అది జరిగింది? అసలు ముందు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫామ్ హౌస్‌ల లెక్కలన్నీ తీసి అవి ఎవరెవరివి, అక్కడ ఎవరెవరు, ఏమేం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకొని ఈ అపకీర్తిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నిష్కృతి ఉండదు.
