Reading Time: < 1 minute

అల్వాల్, ఎల్.బి.నగర్‌లలో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అల్వాల్‌లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆసుపత్రి న్యూరో సైన్స్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్‌గా సేవలు అందించనున్నది. అలాగే ఎల్.బి.నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో ఆరు నెలల లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రి గ్యాస్ట్రో సైన్స్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్‌గా సేవలు అందించనున్నది. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మరింత వేగంగా పనులు జరుగనున్నాయి.

నగరంలో సనత్‌నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్‌లో 1000 పడకల చొప్పున అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులు ప్రారంభం అయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రులపై ప్రతిరోజూ దూర ప్రాంతాలకు వెళుతున్న రోగుల సంఖ్య గణనీయంగా తగ్గనున్నాయి. ప్రధాన ఆసుపత్రులలోని దీర్ఘకాలిక శస్త్రచికిత్సల వెయిటింగ్ లిస్ట్‌ను టిమ్స్‌కు బదిలీ చేయడం ద్వారా ఆయా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనున్నది. కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందడం వల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.