
రానున్న రెండు వారాల్లో రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పౌరసరఫరాల భవన్‌లో రాష్ట్ర రైస్ మిల్లర్లతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మిల్లర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్న
నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రవాణా ఏర్పాటు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం అన్‌లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను (కార్మికులను) ఏర్పాటు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేస్తామని రైస్ మిల్లర్లు అంగీకరించారు.