
గతంలో సుమారు రెండు సంవత్సరాలుగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయనకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తో తనకు ఉన్న నలభై ఏళ్ళ బంధాన్ని తెంచుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు. ఇరవై నెలలుగా పార్టీలో క్షోభకు గురయ్యానని ఆయన ఆవేదనతో చెప్పారు. మరో నాయకున్ని (ఎమ్మెల్యే కె. సంజయ్) ప్రోత్సహిస్తూ తనను అవమానించారని ఆయన పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. తనకు క్లీన్ ఇమేజ్ ఉందన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, త్వరలో జగిత్యాలలో తన అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.