
కోల్‌కతా: IPL 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(కెకెఆర్)కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా కెెకెఆర్ బౌలర్ హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా మరో బౌలర్ కూడా ఈ సీజన్ కు దూరమయ్యాడు. గాయం కారణంగా కెకెఆర్ స్టార్ పేసర్ ఆకాష్ దీప్ IPL 2026 టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. అతను కోలుకోవడానికి 8 నుండి 12 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో అతను IPLకు మాత్రమే కాకుండా, జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన KKR జట్టుకు ఆకాష్ గాయపడటం ఎదురు దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే మరో బౌలర్ మతీషా పతిరణ ఏప్రిల్ మధ్యలో జట్టుతో చేరే అవకాశం ఉంది. పతిరణ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ముగ్గురు కీలక బౌలర్లు జట్టుకు దూరం కావడంతో కోల్‌కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆకాష్ స్థానంలో కెకెఆర్ మరో బౌలర్ ను వెతికే పనిలో ఉంది. ఐదుగురుకి పైగా దేశీయ పేసర్లు ప్రస్తుతం జట్టుతో కలిసి శిక్షణ పొందుతున్నారు. రాణా, ఆకాష్ స్థానాల్లో బౌలర్లు సిమర్‌జీత్ సింగ్, ఆకాష్ మధ్వాల్, ఆర్.ఎస్. అంబ్రిష్ లలో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR.. ఆకాష్ దీప్ ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.