Reading Time: < 1 minute

హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. ఏదో మార్గంలో కొందరు కేటుగాళ్లు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ వ్యాపారవేత్త, మాజీ డిజిపి మనుమరాలిని సైబర్ నేరగాళ్లు మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేశారు. మహిళ వ్యాపారి దివ్యారెడ్డి, అకౌంటెంట్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. 18 కంపెనీలకు మాజీ డిజిపి మనవరాలు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 13న ఆమె పేరు, ఫోటోతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు సందేశం పంపించారు.

తాను మీటింగ్‌లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ మెసేజ్ చేశారని భావించి రూ.1.20 కోట్లను అకౌంటెంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ అకౌంటెంట్‌కు మళ్లీ వాట్సాప్ సందేశం వచ్చింది. డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం డెరెక్టర్‌ని అకౌంటెంట్ సంప్రదించారు. ఈ సందర్భంగా గతంలో చేసిన రూ.1.20 కోట్ల లావాదేవీ వివరాలను అకౌంటెంట్ వివరించారు. దీంతో తాను ఎలాంటి డబ్బు పంపమని చెప్పలేదని దివ్యారెడ్డి ఖంగు తిన్నారు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.