Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా ఏ రేంజ్‌ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్-ది రివెంజ్’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి.. అంత సేపు సినిమా తీసి.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదని.. అందుకు ఎంతో గట్స్ ఉండాలని ప్రశంసించారు.

‘‘‘ధురంధర్’ నాకు బాగా నచ్చింది. కానీ, ది రివెంజ్ మొదటి భాగం కంటే ఎంతో అద్భుతంగా ఉంది. రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, మ్యూజిక్ ఇలా వేటిలోనూ లోపాలు కనిపించలేదు. దర్శకుడు ఆదిత్యధర్ నాలుగు గంటల పాటు తన సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇలాంటి సినిమా చేయాలంటే నిజంగా ఎంతో గట్స్ ఉండాలి. చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చిత్రాన్ని తెరకెక్కించారు. రణ్‌వీర్ సింగ్ తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రలకూ న్యాయం చేశారు. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సమయంలో ఆయన నటన మాస్టర్ క్లాస్. సినిమా మొదటి నుంచి పతాక సన్నివేశం వరకు రణ్‌వీర్ నటన అమోఘం. దేశ నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తెరపై చక్కగా ప్రదర్శించారు. ఈ విజయం మనందరిదీ’’ అని రాజమౌళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.