
హైదరాబాద్: పాతబస్తీలోని జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఐదు లక్షల రూపాయల విలువైన అపరిశుభ్ర ఆహార నిల్వలను పోలీసులు సీజ్ చేయడంతో పాటు నిందితుడి అరెస్ట్ చేశారు. జియాగూడలోని ఎస్.బి.ఏ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సమోసా తయారీ కేంద్రా అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి(73) నిర్వహిస్తున్నాడు. కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ జియాగూడలోని అక్రమ సమోసా తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీజ్ చేసిన వస్తువుల విలువ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆహార కల్తీ, అక్రమ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ నిరంతరం నిఘా ఉంచుతుందని, ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని సిటీ పోలీసులు తెలిపారు.
సీజ్ చేసిన పదార్థాలు:
పాడైపోయిన కోడిగుడ్లు: 500
వాడేసిన వంట నూనె: 5 కిలోలు
తయారు చేసిన పదార్థాలు: ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000)
ముడి పదార్థాలు: మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)
యంత్రాలు: ఫ్రైయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం, వంట పాత్రలు.