Reading Time: 7 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభలో శుక్రవారం, డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం – రూ.47,267 కోట్లుగా వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పు లు, రెవెన్యూ వ్యయం తదితర వివరాలను వెల్లడించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో పాలన సాగిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు.

మహాత్మాగాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుం టూ ఈ రెండేళ్ళ పాలనలో ప్రజలకు తాము ఇ చ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ప్ర జలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్ర జానీకం పట్ల, వారి అభ్యున్నతి పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశామని అన్నారు. మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలుకాదు అని, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రజల జీవనస్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పెద్దపీట

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి,సాంప్రదాయాలకు, పండుగలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని భట్టి విక్రమార్క తెలిపా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను తమ ప్రభుత్వం సత్కరించిందని చెప్పారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు శ్రామిక మహిళ రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూ పొందించామని తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగానిర్వహించామన్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణా న్ని చారిత్రకకట్టడాల మాదిరిగా రాతి తో నిర్మించామని తెలిపారు. కోయవంశీయుల చరిత్రను ఆ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలు గా ఆదివాసీ పద్ధతిలో చెక్కించామని, తెలుగు చలన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ పేరుతో అవార్డులను అందజేస్తున్నామని అన్నారు.

అంతర్జాతీయస్థాయి

విద్యాసంస్థలుగా మన వర్సిటీలు

ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహార్‌లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందని పేర్కొన్నారు.

దేశానికి బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ

2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణస్థూల రాష్ట్రదేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల రూపాయలు అని అని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు10.7 శాతంగా నమోదు అయ్యిందని తెలిపారు. ఇదే సమయంలో, దేశ జిఎస్‌డిపి 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల రూపాయలుకాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉందని అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. అదే విధంగా దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ నిలుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు10.2 శాతం అని పేర్కొన్నారు. దేశతలసరి ఆదాయం రూ.2,19,575 కాగా,వృద్ధి రేటు కేవలం 6.9 శాతం అని చెప్పారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరిఆదాయం రూ.1,99,356 ఎక్కువ అని, అంటే 1.9రెట్లు ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.

ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్) నిధులను సరైన రీతిలో వినియోగించలేదని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సిఎస్‌ఎస్ కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3 వేలకోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసినట్లు వెల్లడించారు.

అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం

ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించిందని అన్నారు. ఈ రుణ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34 వేల 58 కోట్ల రూపాయల నుంచి 11 వేల 915 కోట్లకు తగ్గిందని, దీనిద్వారా రాష్ట్రానికి 22 వేల 142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని తెలిపారు.

గతంలో టియుఎఫ్‌ఐడిసి సంస్థ 10.2 శాతం వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు అని, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పోరేషన్ 9.7 శాతం వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నామని చెప్పారు. దీనిద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నామని వివరించారు.

67,763 మందికి నియామక పత్రాలు అందజేత

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని, టిజిపిఎస్‌సి ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టిజిపిఎస్‌సి నవ్వులపాలు అయిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుపిఎస్‌సి స్థాయిలో టిజిపిఎస్‌సిని పునర్ వ్యవస్థీకరించి, నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి, ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఈ సహాయం అందుకున్న అభ్యర్థులలో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, వారికి అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. వారిలో 20 మంది యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించి, తెలంగాణ రాష్ట్ర యువత,తమ సత్తాను చాటారని అన్నారు.

డిజిటల్ విధానంలో జనగణన

జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు జనగణన మూలాధారం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది అని, దీనిలో స్వీయ నమోదు విధానం, కుల గణన అంశం ఉన్నాయని చెప్పారు. మొదటి దశ జనగణన మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుందని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుందని అన్నారు. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారని, తదుపరి, మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్‌గా తీసుకుంటారని వెల్లడించారు.

అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు

రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్(వైఐఐఆర్) పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుధైక కుటుంబంగా ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒసి విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశామని, 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో 93 కెజిబివిలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించి, 120 కెజిబివిలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచామని తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి టిమ్స్ ప్రారంభం

2026 చివరి నాటికి సనత్‌నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్‌లోని (టిమ్స్) ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే మరో 6,582 టెర్షియరీ కేర్ పడకలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సెకండరీ కేర్ ఆసుపత్రులలో 12,720 పడకలు ఉన్నాయని, దీంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెర్షియరీ కేర్ పడకల సంఖ్య 44,029కు చేరుకుంటుందని అన్నారు. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.

ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, భరోసా అని పేర్కొన్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చని చెప్పారు. అలాగే ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణం

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.12,511 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.

రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రూ.6 కోట్లు

రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒసి వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుందని అన్నారు. ఈ పథకం అమలుకు 6 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం అని, దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర జిఎస్‌డిపి పరిశ్రమల రంగం వాటా 3 లక్షల 4 వేల 217 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఒయుల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇటీవల నగరంలో నిర్వహించిన 23వ బయోఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించిందని, ఈ సదస్సులో రూ. 1,700 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారని చెప్పారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలలో 700 పైగా మహిళా వ్యాపార వేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నామని తెలిపారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.3,490 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు.

మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ

కోటి మహిళలకు కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో మాదిరి కాకుండా, రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగానికి రూ. 258 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. పంచాయతీ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నామని అన్నారు. 2025 డిసెంబర్‌లో 12,702 గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించామని, తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ఎన్నిక అయిన సర్పంచ్‌లందరికీ 5 రోజుల సమగ్ర శిక్షణని అందించామని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రీడ్ ఆన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.33,688 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. అలాగే నీటి పారుదల శాఖకి రూ.22,615 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖకు రూ. 12,789 కోట్లు, న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్డలించారు.

హైడ్రా ద్వారా వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

పాత జిహెచ్‌ఎంసి సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతంనుండి 7.95 శాతానికి తగ్గించామని తెలిపారు. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించిందన్నారు. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ సిటి పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడిందని తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుందని అన్నారు. వీటి విలువ సుమారు 60 వేల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించామని, ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయని వివరించారు. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయని, చెరువుల సంరక్షణకు సిసిటివి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

మూసీ బఫర్ జోన్‌లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పిస్తాం

మూసీనది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టిఎంసిల నీరు మూసీకి అందించబడుతుందని చెప్పారు. మూసీనది బఫర్ జోన్‌లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హైదరాబాద్, హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసిందని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్‌లో 17,907 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు.

సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలను కనబరుస్తున్నదని చెపారు. నక్సలిజాన్ని గత ప్రభుత్వం,ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి -భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి సామాజిక -ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శన మూనాగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి -2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, తమ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి ఈ ఏడాది మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి కేడర్ మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ‘సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పుసాధ్యం అని తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసిందని తెలిపారు. హోం శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.11,907 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.

ఉభయ సభలు సోమవారానికి వాయిదా

శాసనసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉయభ సభల్లో బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం శాససనసభ, శాసనమండలి సోమవారానికి వాయిదా వేశారు.