Reading Time: 3 minutes

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడంపట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్రశ్నించింది. అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్ని ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్లీ ఉచితాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటు లోనే ఉన్నా, ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయంటూ సుప్రీం ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సవరణ నిబంధనలు 2024 లోని రూల్ 23ను సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఈ కేసులో సుప్రీం కోర్టు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలను హెచ్చరించినట్లేనని స్పష్టం అవుతుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ కేసును ఉద్ఘాటిస్తూ.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం మంచిదే. కానీ దానికి మూల్యం ఎవరు చెల్లించాలి? ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. అదంతా పన్ను చెల్లింపుదారులదే కదా? అంటూ అన్ని రాష్ట్రాలకు చురకలంటిచ్చినట్లు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీల మేనిఫెస్టోపై చర్చ అనవసరం. సంక్షేమం, ఉచితాలు రెండు విభిన్న దృక్పథాలు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, రాజకీయ పార్టీలు సంక్షేమం ముసుగులో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఉచితాలు ప్రకటిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా అందలం ఎక్కేందుకు తొలుత తమ తలతాకట్టు పెట్టైనా హామీలను మీ గడపలకు చేరుస్తామని ప్రగల్భాలు పలికి అనంతరం ఆశతో అధికారమిచ్చిన ప్రజల తలపైనే చేతులు పెడుతున్న తీరును నేటి ప్రభుత్వాల్లో గమనిస్తున్నాం. ఒక నిర్దిష్టమైన ఆర్థిక విధానం అంటూ లేకుండా, అయితే అప్పులు చేస్తూ, లేకపోతే ధరలు పెంచుతూ ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నాయి.

ఉచితాల అంశాన్ని తెర మీదికి రావడానికి కారణమైన తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ నిబంధనలు- 2024 లోని నిబంధన 23 మేరకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రస్తావిస్తూ.. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని, ఈ భారం ప్రభుత్వం స్వీకరించడం ఎంత వరకు ప్రజా ప్రయోజనం, విద్యుత్ బిల్లు చెల్లించే శక్తి ఉన్నవారికి, లేనివారికి మధ్య ప్రామాణికం ఏంటి? సంక్షేమ రాజ్యంగా అణగారిన వర్గాలు, అవసరమైన వారికి సాయం చేయడాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. దాన్ని సమాజం కూడా అదే రీతిలో స్వాగతించాలి. కానీ కొందరు వ్యక్తులు అన్ని ఉండి కూడా తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వం అమలుచేసే పథకాలు, ఉచితాలు తమ జేబుకే చేరాలనుకునేవారు సమాజంలో అనేక మంది ఉండడమే ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 200 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నరు.

రాష్ట్రంలోని కొన్ని లక్షల కుటుంబాలకు ఉపశమనం కలిగించే విషయమే. ప్రభుత్వం బాధ్యతగా భరోసాను కల్పించే పథకమే ప్రవేశపెట్టింది. కానీ ఏ స్థాయిలో ఈ పథకం ఉపయోగపడుతుందో అదే స్థాయిలో బిల్లు కట్టే స్థోమత ఉన్నవారికి కూడా అందించడం అసలు పథకం సార్థకతను ప్రశ్నించే విధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఉచిత పథకాలు సమాజానికి ప్రమాదమే. ఎప్పడు ప్రమాదం అంటే అన్నీ ఉన్నవారికి కూడా ఇచ్చినప్పుడు, కడుపునిండా తినే స్థోమత ఉన్నవాడికి ఇచ్చినప్పుడు, ఈ ఉచితాలు తప్పక నిరుపయోగమే. కానీ బొక్కలుతేలి ఆకలిని అలవాటుగా మార్చుకుని తన దైనందిన జీవితాన్ని తప్పక కొనసాగిస్తున్న పేదవానికి ఉచితం అందితే అది తప్పక అమృతం అవుతుందే కానీ విషం కాదు. మన తెలంగాణ రైతాంగం అంటేనే రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక రకమైన అభిప్రాయం అప్పుల ఊబిలు, ఉరికొయ్యలు, పురుగుల మందు డబ్బాలు, – బీడు భూములు, కరెంటు కోతలు, అడుగంటిన బోరుబావులు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మన రైతుల సమగ్ర స్వరూపం. ఏదిఏమైనా రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడికి రైతుబంధు డబ్బులు మాత్రం ఒక గొప్ప ధీమాను కల్పించాయని చెప్పడానికి ఒక్కటా రెండా అనేక జీవితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉన్నాయి.

ఈ పథకం సైతం అమలు విషయంలో దుర్వినియోగం అయింది. ఇప్పటివరకు రైతులకు నష్టం కంటే లాభం ఎక్కువగా చేసిన పథకం ఏదైనా ఉంది అంటే అది ఇదే. రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్ల పథకంతో ప్రతి నెల ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోయినా ఆయా వర్గాలను ఆత్మవిశ్వాసంతో బతకడానికి అవసరమైన ధీమాను ఈ పథకం కల్పించింది. రాజ్యం ఇదొక మానవీయ పథకంగా భావించాలే తప్ప ఉచితంగా పరిగణించవద్దు. పెద్దపెద్ద పారిశ్రామిక కుటుంబాలకు వేలకోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేసిన దేశ పాలకులు సైతం ఉచిత పథకాలను విమర్శిస్తున్నారు. తమకు అందని ఉచిత పథకం ఏదైనా వృథానే అనిపించడం మామూలే. అతి ఎప్పుడైనా కొంపకు చేటే అన్నట్లు అనవసరమైన ఉచితం వ్యవస్థ ఉనికికే ముప్పు. ఈ సందర్భంగా మనందరం గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే ఉచిత హామీల అమలు కోసం ఎంత మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. అందుకు నిధుల సమీకరణ ఎలా జరుగుతుంది అన్న ప్రశ్నలు సంధించుకుని మనకు మనమే సమాధానం చెప్పుకుంటే తప్ప మనకు మనం తెలుసుకోలేం. అర్థం కాదు కూడా ఈ ఉచితాల ముసుగు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఉచితాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టకుండా, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించాలి.

– పిన్నింటి విజయ్ కుమార్

90520 39109