Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 మందికి ఈ పదోన్నతులు లభించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిసిఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్‌బుధవారం జారీ చేశారు. పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టిజిటిఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టిజిఆర్‌ఎస్‌ఏ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తమ కృషి ఫలితంగానే 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా పదోన్నతి లభించిందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, వి.భిక్షంలు పేర్కొన్నారు. ఈ పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, సిసిఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌లకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి కృషి ఎంతో ఉందని వారన్నారు.