Reading Time: < 1 minute

హైదరాబాద్: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం  కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామని తెలియజేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని, అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వరలోనే ఫైనల్ చేస్తామని వివరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జర్నలిస్టులుక ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని అతి కొద్దిరోజుల్లోనే ఆ తీపికబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు.