Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై సలహాలు ఇస్తామని ఆశించామని, ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ ఢిల్లీకి ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిందని, పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారో లెక్క తీయాలని శ్రీధర్ బాబు సూచించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తామని, ప్రభుత్వాన్ని ఆషామాషీగా కాదు.. బాధ్యతాయుతంగా నడుపుతున్నామని తెలియజేశారు.

ప్రభుత్వం నడపడమంటే యజ్ఞమని.. ప్రభుత్వంలో లేనప్పుడు భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం యజ్ఞమని గుర్తించినందుకు సంతోషమని అన్నారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మా తీసుకురావాలని చూస్తున్నామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తు వాటికి అవసరమైన సౌకర్యాలు వస్తాయని అన్నారు. రూ.5.75 లక్షల కోట్లతో ఎంవొయులు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారని, దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎంవొయులు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంవొయుల్లో 30-40 శాతం వాస్తవ రూపం దాలుస్తాయని మహారాష్ట్ర తెలిపిందని, ఎంవొయిలు, పెట్టుబడుల విషయంలో శ్వేతపత్రం సమర్పిస్తామని అన్నారు. మహిళల సాధికారత విషయంలో హేళనగా మాట్లాడటం సరికాదు అని శ్రీధర్ బాబు అన్నారు.