Reading Time: 2 minutes

పదిమాసాల పాఠశాల లేదా కళాశాల విద్యా సంవత్సరం పూర్తి కావడం, ఆ తర్వాత పరీక్షలు కూడా పూర్తి అయిన తర్వాత మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల రాకకోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురుచూడడం జరుగుతుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే రెండు మాసాల వేసవి సెలవులు యువతకు ఎన్నో రకాల అనుభవాలను మూటకట్టి పెడతాయి. ఊపిరాడనంతగా ఒకే రకమైన యాంత్రిక జీవనశైలి గడిపిన విద్యార్థులు విద్యాలయ దినచర్యకు దూరం జరిగి వేసవి సెలవుల్లో కొన్ని వారాలపాటు విశ్రాంతి, వినోద విరామాలను పొందుతూనే తమకు నచ్చిన పసందైన కార్యక్రమాలకు ప్రాణం పోసేందుకు యువత ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో స్వేచ్ఛగా, సరదాగా గడపడానికి వేదికలుగా వేసవి సెలవులు ఉపయోగపడతాయి. హోమం వర్క్, పరీక్షలు, తీరిక ఇవ్వని అకడమిక్ కార్యక్రమాలు, నోట్స్ రాయడం, బడి గంటలకు దూరంగా తమకు నచ్చిన రీతిలో వేసవి సెలవులు గడపడానికి పిల్లలు పథకాలు వేస్తూ ఉంటారు.

మానసిక ఒత్తిడి నుంచి బయటపడి తమ అభిరుచులు, ఆసక్తి కలిగిన పనులు, ఆటపాటలు, ఆన్‌లైన్‌లో మునకలు, సినిమాలు, పర్యాటక ప్రయాణాలు, క్రీడా ప్రాంగణాలకు పరుగులు, అమ్మ చేతి వంట రుచులు, దర్శనీయ స్థలాల పయనాలు, వినోద విజ్ఞాన వేదికలు, ఆరోగ్యం కాపాడుకునే కార్యాలు, మానసిక ఉల్లాస విందులు, సృజన/ విలక్షణ ఆలోచనలు, తమకునచ్చిన ఫైన్ ఆర్ట్‌లో శిక్షణల కోరికలు లాంటి అనేక ప్రణాళికలను నిజం చేసుకునే సమయంగా వేసవి సెలవులు ఉపకరిస్తాయి. అవసరం మేరకు నిద్రపోవడం, మెదడు చురుదనం పెంచడానికి కార్యక్రమాలు, మనసుకు నచ్చిన కార్యక్రమాలు చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించే అంశాలకు సమయం ఇవ్వడం వేసవి సెలవుల్లో మాత్రమే జరుగుతుంది. తమకు నచ్చిన అంశాలకు చెందిన పుస్తకాలు చదవడం, విజ్ఞాన వినోదాత్మక సినిమాలు చూడడం, సుస్వర సంగీతం వినడం, ఆటపాటల్లో మునిగితేలడం, కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో కలిసి బయటకు వెళ్లడం లాంటివి మానసిక వికాసానికి, మనసును తేలిక పర్చుకోవడానికి ఉపకరిస్తాయి.

మన ప్రేమను చూరగొన్న సమీప బంధువులు లేదా మిత్రుల వద్దకు వెళ్లడం, పిక్నిక్/జూ/సర్కస్/ఎగ్జిబిషన్‌లకు వెళ్లడం, మనకు నచ్చిన క్రీడలు లేదా కళల్లో శిక్షణ తీసుకోవడం, వ్యక్తిత్వ వికాస ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావడం లాంటివి మంచి నిర్ణయాలు అవుతాయి. నేటి ఆధునిక డిజిటల్ యుగం లో పుట్టుకొస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతి ఫలాలను ఆస్వాదించడం, దినపత్రికలను చదవడం, పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు పరిజ్ఞానాలను పొందడం, మానసిక పరిపక్వతకు ఆజ్యం పోసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరుకావడం లాంటివి పిల్లలకు అందుబాటులో ఉంచాలి. నైపుణ్యాలు, విజ్ఞానం, సామర్ధ్యాలకు పదును పెట్టడం లాంటివి మరువరాదు. సృజనశీల అంశాల్లో అడుగు పెట్టడంతో పాటు ఇన్నొవేటివ్ ఆలోచనలు చేయడం మన పిల్లల శారీరక మానసిక భావోద్వేగ వికాసానికి దోహదపడతాయి.

నేటి ఆరోగ్యమే రేపటి భవితకు పెట్టుబడి అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్ముతూ వేసవి సెలవుల్లో ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. తగినంత సమయం నిద్ర పోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, పరిమిత సమయం పాటు ఆటపాటలకు కేటాయించడం, ప్రతి రోజు కొంత సమయం వ్యాయామం/యోగా/ప్రాణాయామం/వాకింగ్/స్విమ్మింగ్/ట్రెక్కింగ్/మౌంటెనీరింగ్ చేయడం, సూర్యోదయాన్ని చూసి ఆనందించడం మరువరాదు. వీటికితోడుగా తోట పనుల్లో నిమగ్నం కావడం, పర్యావరణ పరిరక్షణ సేవలు, నిస్వార్థ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, దేవాలయాలు లేదా ప్రార్థనా స్థలాలను సందర్శించడం లాంటివి చేయడం ఉత్తమం అని భావించాలి. పిల్లలు వేసవి సెలవులను సమర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా గడపడంలో తల్లిదండ్రుల పాత్ర అధికమని గమనించాలి. వేసవి సెలవుల రూపంలో లభించిన రెండు మాసాల్లో పిల్లల దురలవాట్లు లేదా అనారోగ్యకర దినచర్యలకు అలవాటు పడకుండా చూసుకోవడం పెద్దల కనీస కర్తవ్యం అని తెలుసుకోవాలి.

అధిక కాలం పాటు స్మార్ట్‌ఫోన్ వాడడ్‌ం లేదా టివీ ముందు కూర్చోవడం మంచి అలవాటు కాదని వారించడం మరువరాదు. కరోనా లాక్‌డౌన్ వల్ల పిల్లలు స్మార్ట్‌ఫోన్ బానిసలుగా మారడం చూసాం. ఆన్‌లైన్ గేమ్స్‌కు బదులుగా అవుట్/ఇండోర్ డోర్ గేమ్స్ ఆడడం ఉత్తమమని నమ్మాలి. వేసవి ఎండలను గమనిస్తూ, గంటల తరబడి మైదానాల్లో ఆడకుండా, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతి నిద్ర లేదా అతిగా తినడం లేదా అతి గారాబానికి ఆస్కారం ఇవ్వకండి. డ్యాన్స్, ఫైన్ ఆర్ట్, స్విమ్మింగ్, సైక్లింగ్, మ్యూజిక్‌‌, ఆటలు లాంటివి నేర్పించండి. వేసవి సెలవులు పూర్తి స్వేచ్ఛకు నెలవులు కావని, వినోదంతో పాటు విజ్ఞానం, ఆటపాటలతో పాటు శారీరక మానసిక వికాసం, ఆన్‌లైన్‌లో సంచరిస్తూ దురలవాట్ల కోరల్లో పడకుండా రేపటి బాధ్యత కలిగిన పౌరులుగా మారడానికి నేటి పిల్లలకు వేసవి సెలవులు ఉపయుక్తం కావాలని కోరుకుందాం. పిల్లల అభిరుచులను గమనిస్తూ వేసవి సెలవుల్లో వారి వ్యక్తిత్వ వికాసం జరిగే విధంగా, విజ్ఞానవంతులుగా మారడానికి తల్లిదండ్రులు పటిష్ట ప్రణాళికలు వేసి వాటిని పక్కాగా అమలు చేయాలి. వేసవి సెలవులను వ్యర్థం చేయవద్దు. సెలవుల కాలం సకల నైపుణ్యాలను వడ్డించే నెలవుగా మారాలని కోరుకుందాం.

– బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037