Reading Time: 2 minutes

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన పాత ఫ్లెక్సీలు అన్నింటినీ ఆయన అనుచరులు తొలగించి కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ కలర్ లేకుండా, ఆ పార్టీ నేతల ఫోటోలు లేకుండా కేవలం జీవన్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. గత 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి గత రెండేళ్లుగా పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తనకు గౌరవం దక్కకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఆయనను కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ రెండు రోజుల క్రితం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా ఒప్పుకోనట్లు తెలిసింది. పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి తన అనుచరులు, సన్నీహితులతో చర్చించి ఈనెల 25న స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి జీవన్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. సోమవారం తన అనుచరులు, అభిమానులు, రైతులతో కలిసి బైక్ ర్యాలీతో కలెక్టరేట్ కు చేరుకొని ప్రజావాణిలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించడంతో పాటు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అకాల వర్షాలతో వంటలు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని, అందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు ఆయన వేస్తున్న అడుగులను బట్టి చూస్తే పక్కా కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీని వీడిన తర్వాత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇప్పుడే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉండదలుచుకోలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.