Reading Time: < 1 minute

ఐదు రోజులు కురిసే అవకాశం

వెల్లడించిన వాతావరణ శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : మార్చి ఆరంభంలోనే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అలర్ట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సుమారు 40 నుంచి -50 మి.మీ మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ద్రోణి ప్రభావం ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశాముందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తుందని, దీంతో మండే ఎండలతో సతమతమవుతున్న జనాలకు కొంత మేర ఉపశమనం లభించనుందని వివరించింది. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.