
అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు
డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్
మనతెలంగాణ/హైదరాబాద్ : మొయినాబాద్‌లోని మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి జరిగిన విందులో టిడిపి ఎంపీ మహేష్ యాదవ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని సమాచారం ఉందని, ఆ ఫార్మ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని అన్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా కెటిఆర్‌పై కావాలని బురద జల్లుతోందని మండిపడ్డారు.
పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి సహవాస దోషంతో కెటిఆర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా తన హోదాకు తగ్గట్టు వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ ఘటనకు కెటిఆర్‌ను లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండు కు సంబంధం అంటగట్టినట్లేనని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు ఉందా..? అని ప్రశ్నించారు. చెర్లపల్లిలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ముంబై పోలీసులు పట్టుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముంబై పోలీసులు వచ్చే వరకు రాష్ట్రంలోని ఈగల్ పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇది సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశంపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, డ్రగ్స్ టెస్ట్‌కు బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కాగానే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలువరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. దీనికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.