
మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా -చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు. ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం.ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్త్రాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవస్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి.
వీటికి అనుబంధంగా మరో 15వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఎంజిపిటి హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి.దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (జిఐ) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి.
తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గాయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మువ్వన్నెల జెండాను నేసిన చేతులు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యంతో నేసిన కళాకారులు వీరే. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 11 మార్చి, -2024న ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్‌టైైల్) శాఖ ద్వారా జారీ చేసిన జి.ఒ. ఎం.ఎస్. నెం.1 ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.
అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా పరిరక్షింపబడుతుంది. చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. చేనేత పరిశ్రమను కాపాడి వేలాది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అలాగే రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. మువ్వన్నెల జెండాను నేసిన ఆ చేతులు నేడు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఆ చేతులు మగ్గం మీద మళ్లీ ఆశల నూలుపోగులు అల్లాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి చేనేత రంగాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.
– కోట దామోదర్
93914 80475