
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్యలో డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సింగపూర్ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్య లో డ్రోన్లను సింగపూర్ నుంచి తీసుకు రావడం వెనక కారణం ఏంటి? అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్ అధికారులు పట్టుకు న్నారు. రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్ నుంచి శంషాబాద్‌కు తీసుకు వచ్చారు. పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వార్ ఎఫెక్ట్…13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ముదురుతుండటం వల్ల అక్కడి గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనితో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారడంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.