
వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం LPG సరఫరాలో ఎలాంట ఇబ్బందులు లేవని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ లో యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హిందూస్థాన్, ఇండియన్ ఆయిల్ సంస్థలు తాత్కాలికంగా బుకింగ్ ను నిలిపేశాయి. ఈ క్రమంలో ప్రజల్లో మరింత ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై పెట్రోలియం శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ సరఫరా గొలుసు దెబ్బతింటున్నందున ప్రజలలో భయాందోళనలు బాగా పెరుగుతున్నాయని.. అందుకే, చాలామంది అవసరం లేకున్నా LPG బుకింగ్ చేస్తున్నారని తెలిపారు. 92,700 మెట్రిక్ టన్నులతో రెండు LPG నౌకలు ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని.. మార్చి 16-17వరకు భారత్ కు చేరుకుంటాయని వెల్లడించారు.