
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఫరూఖ్ అబ్దుల్లా శుక్రవారం ఉదయం గ్రేటర్ కైలాష్ రాయల్ పార్క్ ప్రాంతంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల దాడి నుంచి ఫరూఖ్ తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10:30 గంటల తర్వాత ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితోపాటు ఫరూఖ్ హాజరైన పెళ్లి వేడుకలో ఒక వ్యక్తి ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు.. ఆయనను రక్షించారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కమల్ సింగ్ జామ్వాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు విచారణ చేపట్టారు. నిందితుడు మద్యం మత్తులో కాల్పులు జరిపాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను ఎవరిపై దాడి చేయాలనుకుంటున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన సిసిటివి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.