Reading Time: 2 minutes

ప్రముఖ ఉర్దూ రచయిత్రి, మేధావి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, జిలాని బాను తన 89 ఏళ్ల వయసులో హైదరాబాద్ నగరంలో మార్చి 1,2026వ తేదీన మరణించారు. 1936 జూలై 14 న ఆమె బదాయున్ (అవధ్, ఆగ్రా సంయుక్త ప్రావిజన్) లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్ హెడ్ గా పనిచేసిన ప్రముఖ కవి, అన్వర్ మౌజంతో వివాహం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తండ్రి కూడా ప్రముఖ కవి. హైదరాబాద్ నగరం అప్పటికే, ప్రగతిశీల ఉర్దూ సాహిత్యానికి పునాదులు వేసి వుంది.

బాల్యం నుండి సాహిత్య వాతావరణం మధ్య పెరిగిన జిలానీ బాను చాలా చిన్న వయసులోనే, సుమారు 8 ఏళ్ల ప్రాయంలోనే రాయడం మొదలుపెట్టారు.1950ల నుండి రచన వ్యాసంగాన్ని ప్రారంభించినా, జిలానీ బాను మొదటి కథ ‘ఏక్ నజర్ ఇదర భీ’ ‘1952 లో’ప్రచురించబడింది. వరకు సుమారు 22 పుస్తకాలని రచించారు. అనేక కథలు, నవలలు, రేడియో నాటికలు, వ్యాసాలని, ఆమె రాశారు. రేడియోలో ఆమె రచనలు అనేకం ప్రసారం అయ్యాయి. ఆమె 2009లో ఆమె రాసిన ఒక కథ ‘నరసయ్యకి బావిడి’ ‘వెల్డన్ అబ్బాస్’, అనే పేరుతో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ సినిమాగా తీశాడు.

జిలానీ బాను రాసిన ఎ గజల్ ’ కి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1960లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1980 లో సోవిట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, 2001లో ఆమెకి పద్మశ్రీ అవార్డు వచ్చాయి. అంతే కాదు అనేక ఇతర పురస్కారాలు కూడా ఆమె పొందారు. జిలానీ బాను ప్రముఖ రచయిత్రి మాత్రమే కాదు ఆమె ఒక సామాజిక కార్యకర్త కూడా. అనేక సామాజిక అంశాలపై తను సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. యూత్ ఫర్ యాక్షన్ కి చైర్పర్సన్ గా, చైల్ అండ్ వుమెన్, హ్యూమన్ రైట్స్ సంస్థకి ప్రిన్సిపల్ అడ్వైజరీ గా కూడా ఉన్నారు.అస్మిత సంస్థకి చైర్పర్సన్ గా కూడా చాలా కాలం పాటు ఉన్నారు. రోష్నికి మినార్, నిర్వాణ్ , జంగ్ ఔర్ సితార, ఆవామీకి గజల్, ఐవాన్ ఏ గజల్, రాజ్ కి కిస్సా, రస్తా బంద్ హై, ఏ కౌన్ హన్ సా, వంటి అనేక రచనలు, అలాగే రాత్కి ముసాఫిర్, నయీ ఔరత్, బాత్ ఫూలోంకి వంటి కధా సంకలనాలు అనేకం ఆవిడ రాసారు. జిలాని బాను రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

ముస్లిం ప్రపంచపు తలుపుల్ని ఆమె మన కోసం తెరిచారు. హైదరాబాద్ నగర జీవితంలో గల ప్రత్యేకత్వాన్ని, సహజీవన సంస్కృతిని ఆమె రచనలు ప్రతిబింబించాయి. మానవ జీవితంలో గల సంక్లిష్టతల్ని, విషాదాలను , పోరాటాలను అవి కళ్లకు కట్టాయి. ప్రగతిశీల భావాలు, స్త్రీల స్వేచ్ఛ ఆమె రచనలలో ప్రతిఫలిస్తాయి. ఉర్దూ సాహిత్యంలో తనదైన ప్రత్యక ముద్రను వేసిన రచయిత్రి ఆమె.దేశ విభ జన కాలం నుంచి నేటి వరకు జరుగుతున్న అనేక మార్పుల్ని, సామాజిక జీవన చిత్రాన్ని ఎంతో సమర్థవంతంగా, సుదీర్ఘ కాలం పాటు వ్రాసి న రచయిత్రి ఆమె. దాదాపు 75 ఏళ్ల కాలం పాటు రాస్తూనే ఉన్నారు జిలానీ బాను. సామాజిక చరిత్ర గమనాన్ని అర్థం చేసుకోవడం కోసం తప్పకుండా ఆమె రచనలను అందరూ చదవాలి. జిలానీ బాను ను ప్రేమగా తలుచుకుంటూ, మెహాఫిల్ ఆవిడకి నివాళి అర్పిస్తోంది.

– విమల