
- లక్ష 70 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. దిగువకు లక్ష 76 వేల క్యూసెక్కుల నీటి విడుదల
- శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్న 1,69,211 క్యూసెక్కుల వరద
- గోదావరి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
హైదరాబాద్, వెలుగు నెట్ వర్క్: నిన్న మొన్నటి వరకు ఉగ్ర రూపం దాల్చి ప్రవహించిన గోదావరి నది కాస్త శాంతించింది. దీంతో గోదావరి ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. అదే సమయంలో స్టడీగా ఉన్న కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. నిన్నటి వరకు భద్రాచలం వద్ద 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవగా.. ప్రస్తుతం 9 లక్షలకు తగ్గింది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో వరద తగ్గుముఖం పట్టడంతో.. లోయర్ గోదావరిలోనూ తగ్గుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం శాంతించింది.
ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. గరిష్టంగా 56.10 అడుగులకు చేరుకున్న గోదావరి తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 52.90 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాదహెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 47.90 అడుగులకు రాగానే రెండో ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 42.80 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు. మొత్తం ప్రవాహం 15,96,899 క్యూసెక్కుల నుంచి 9,14,631 క్యూసెక్కులకు పడిపోయింది.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు లో 1074.60 అడుగులు (31.91 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం వరకు 47,391క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా సాయంత్రానికి 19,457 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం కాకతీయ కెనాల్ కు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మాత్రం నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి కెపాసిటీ 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.9253 టీఎంసీల నీరు చేరింది.
దీంతో నంది పంపుల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరు మిడ్మానేరుకు చేరుకుంటుంది. నాలుగు రోజుల కింద ప్రాజెక్ట్ లో 7 టీఎంసీల నీరు ఉండగా.. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద రావడంతో మూడు రోజుల్లోనే 19 టీఎంసీలు దాటింది. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడంతో గోదావరికి వరద వస్తున్నది. మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద ఆదివారం 5,52,600 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీ 85 గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్లం 94.50 మీటర్లుగా కొనసాగుతోంది.
జూరాల -27 గేట్లు ఓపెన్
గోదావరికి వరద క్రమంగా తగ్గుతుండగా.. కృష్ణానదికి మాత్రం విపరీతంగా పెరుగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల మరింత పెరుగుతున్నది. కర్నాటక ప్రాజెక్టులతో పాటు కృష్ణా నదికి ఉపనది అయిన బీమా నదిపై నిర్మించిన సనతి బ్యారేజ్ నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నది. జూరాల ప్రాజెక్టు దగ్గర 27 గేట్లు ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం దగ్గర 518.95 మీటర్ల లెవెల్ నీటిని స్టోరేజీగా ఉంచుకొని లక్షా 30 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు.
ఆల్మట్టి డ్యాం కు 1,21 500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉన్నది. నారాయణపూర్ డ్యామ్ దగ్గర ప్రస్తుతం 491.41 మీటర్ల నీటిని స్టోరేజ్ ఉంచుకొని 29 గేట్లను ఓపెన్ చేసి 1,25,144 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉన్నది. అదేవిధంగా బీమా నది నుంచి 48 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా జూరాలకు వస్తున్నది. జూరాల ప్రాజెక్టు దగ్గర 317.33 లెవెల్ నీటిని స్టోరేజ్ ఉంచుకొని 27 గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలంకు నీటిని విడుదల చేస్తున్నారు.
27 గేట్ల ద్వారా 1,40,500 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,464 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, బీమా-1కి 1300, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 630, ఎడమ లెఫ్ట్ కెనాల్ కు 820, రైట్ కెనాల్ కు 700, సమాంతర కాలువకు 400, బీమా లిఫ్ట్-2కి 872 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తం 1,58,702 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 1,56,500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. అలాగే, జూరాల, సుంకేశుల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం 1,69,211 క్యూసెక్కులుగా వరద ప్రవాహం ఉంది.
ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షాలు?
నైరుతి రుతుపవనాల సీజన్ రెండో అర్ధభాగం కలవరపరిచేలా ఉన్నది. సెకండాఫ్ లో వర్షాలు కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలంగాణ సహా దేశమంతటా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా ఆగస్టు – సెప్టెంబర్ కాలానికిగానూ ఐఎండీ వర్షపాతం, ఉష్ణోగ్రతల అంచనాలను వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు మరింత బలపడుతుండటంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీర్ఘకాలిక సగటు 94 శాతం కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొంది. సగటు వర్షపాతం 422.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉన్నా.. అంతకన్నా తక్కువ నమోదవుతుందని తెలిపింది.
ఆగస్టులో 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉన్నా.. తక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. అయితే, తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో మాత్రం ఈ నెల సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనాల్లో ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం నీటి వినియోగం, పంటల రక్షణ విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.