Reading Time: 2 minutes
Team India: రహానే దారిలోనే ఆ ఐదుగురు.. టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ క్రికెటర్లు..!

5 Indian Cricketers Ready for Retirement: అజింక్య రహానే సడన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం క్రీడా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న రహానే బాటలోనే మరో ఐదుగురు సీనియర్లు నడిచేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. బిసిసిఐ సెలెక్టర్ల విస్మరణతో తీవ్ర నిరాశలో ఉన్న ఆ స్టార్ ఆటగాళ్లు త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జోరందుకుంది.

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నట్లుండి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత మూడేళ్లుగా జాతీయ జట్టులో చోటు దక్కక పోవడంతో సుదీర్ఘ ఆలోచన తర్వాత అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రహానే నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అతడి నిష్క్రమణతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది. అయితే, అసలు కథ ఇక్కడితో ఆగలేదు. బిసిసిఐ సెలెక్షన్ కమిటీ పదే పదే పక్కన పెడుతుండటంతో ఆవేదన చెందుతున్న మరికొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.

స్వింగ్ కింగ్ భువనేశ్వర్.. పేస్ గుర్రం ఇషాంత్..

స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరిగినా బౌలింగ్ పదును మాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇన్ని మెరుపులు మెరిపిస్తున్నా బిసిసిఐ సెలెక్టర్లు అతడి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ వివక్షతో విసిగిపోయిన భువనేశ్వర్ త్వరలోనే వీడ్కోలు పలికే యోచనలో ఉన్నాడు.

మరొకవైపు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. టీమిండియా తరపున చివరిగా ఒక మ్యాచ్ ఆడి గౌరవంగా తప్పుకోవాలని భావిస్తున్నా సెలెక్టర్ల తీరు అందుకు సహకరించడం లేదు. 37 ఏళ్ల ఇషాంత్ తిరిగి భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం దాదాపు అసాధ్యంగా మారింది. అతడు కూడా త్వరలోనే గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

త్రిబుల్ సెంచరీ వీరుడు.. లార్డ్ శార్దుల్..

టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున త్రిబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్‌ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏడేళ్ల నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చినా తనకు వచ్చిన నాలుగు అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం కోల్పోయారు. తిరిగి జట్టులోకి రావడం కష్టమవడంతో కరుణ్ నాయర్ రిటైర్మెంట్ అంచున నిలిచాడు.

అటు ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాగూర్ కెరీర్ తీవ్ర గందరగోళంలో పడింది. హర్షిత్ రాణా లాంటి యంగ్ ప్లేయర్లు జట్టులోకి రావడం శార్దుల్ అవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం కామెంటరీ చెప్తున్న శార్దుల్ త్వరలోనే ఆటకు గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

షమీ లాంటి స్టార్‌కూ విస్మరణ తప్పలేదు..

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా బిసిసిఐ సెలెక్షన్ కమిటీ అతడిని నిరంతరం విస్మరిస్తూ వస్తోంది. జట్టులో చోటు దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్న షమీ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఐదుగురు దిగ్గజాలు రహానే బాటలోనే పయనించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..