Reading Time: 2 minutes
Shahid Kapoor Rashmikas Romantic Drama Cocktail 2 Gets Netflix Streaming Date

Cocktail 2 OTT Release: ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’. థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీకి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన అందుకుంది. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ సాధించడం కూడా దీనికి లభించిన ఆదరణ ఎలాంటిదో తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

2012లో విడుదలైన సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన ‘కాక్‌టెయిల్’ సినిమాతో ఈ చిత్రానికి టైటిల్ పరంగా మాత్రమే సంబంధం ఉంది. ఇది ఆ కథకు సీక్వెల్ కాదు, కొత్త కథతోనే ఈ సినిమాను రూపొందించారు. థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగిసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి ‘కాక్‌టెయిల్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో ఈ రొమాంటిక్ డ్రామాను మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ ప్రేమకథను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

సినిమా కథ

ఈ స్టోరీలో కునాల్ పాత్రలో షాహిద్ కపూర్, దియా పాత్రలో రష్మిక మందన్నా కనిపిస్తారు. ఇద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తుంటారు. పెళ్లి గురించి కుటుంబ సభ్యుల ఒత్తిడికి దూరంగా ఉండాలని భావించి ఇటలీలోని అందమైన సిసిలీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్తారు. అక్కడ దియా తన పాత స్నేహితురాలు అల్లీని కలుస్తుంది. తన ప్రేమికుడి నమ్మకాన్ని పరీక్షించాలని భావించిన దియా, అల్లీతో కునాల్‌ను కొద్దిగా ఫ్లర్ట్ చేయమని కోరుతుంది. అయితే సరదాగా మొదలైన ఆ పరీక్ష అనూహ్య మలుపు తిరుగుతుంది. అల్లీ నిజంగానే కునాల్‌పై ప్రేమలో పడటంతో ముగ్గురి జీవితాలు త్రికోణ ప్రేమకథగా మారిపోతాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా హైలెట్ గా ఉంటాయి. క్లైమాక్స్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మూవీపై ఓ లుక్ వేయాల్సిందే .

ఇక రష్మిక మందన్నా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకోగా, కృతి సనన్ పాత్ర కూడా గ్లామర్‌ డోస్ తో అలరించింది.  షాహిద్ కపూర్ తన యాక్టింగ్ తో కథను ముందుకు నడిపించాడు. ఈ ముగ్గురి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇందులో టికూ తల్సానియా కీలక పాత్రలో నటించగా, పుల్కిత్ సమ్రాట్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రేమ, నమ్మకం, అపార్థాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలను కూడా అందిస్తుంది.