Reading Time: 2 minutes
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..

రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే శరీర భాగాల్లో చేతులు ఒకటి. మొబైల్ ఫోన్ వాడటం, డబ్బు లావాదేవీలు చేయడం, తలుపుల హ్యాండిల్స్ పట్టుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను తాకడం వంటి అనేక సందర్భాల్లో చేతులకు బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ కలుషితమైన చేతులతో కళ్లను, ముక్కును, నోటిని తాకడం లేదా చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఆ సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి అనేక అంటువ్యాధులకు కారణమవుతాయి. అందుకే చేతుల పరిశుభ్రత ఆరోగ్యానికి అత్యంత అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చేతులు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సూచనల ప్రకారం.. సబ్బుతో చేతులను సరిగ్గా కడుక్కోవడం ద్వారా అనేక అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చు. చేతుల పరిశుభ్రత వల్ల..

  • బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తి తగ్గుతుంది.
  • జలుబు, ఫ్లూ, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
  • ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు.
  • పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి అదనపు రక్షణ లభిస్తుంది.

చేతులు సరిగ్గా ఎలా కడుక్కోవాలి?

CDC మార్గదర్శకాల ప్రకారం చేతులు కడుక్కోవాల్సిన సరైన విధానం ఇలా..

  • ముందుగా పారుతున్న శుభ్రమైన నీటితో చేతులను తడపాలి.
  • చేతులకు సబ్బు రాసుకోవాలి.
  • అరచేతులు, చేతుల వెనుక భాగాలు, వేళ్ల మధ్య భాగాలు, బొటనవేళ్లు, గోళ్ల కింది భాగాలను బాగా రుద్దాలి.
  • కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • తర్వాత పారుతున్న నీటితో సబ్బును పూర్తిగా తొలగించాలి.
  • శుభ్రమైన టవల్ లేదా ఎయిర్ డ్రైయర్‌తో చేతులను పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

సబ్బు అందుబాటులో లేకపోతే?

సబ్బు, నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు.అయితే చేతులపై మట్టి, నూనె లేదా మురికి స్పష్టంగా కనిపిస్తే శానిటైజర్ సరిపోదు. అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం ఉత్తమం. ఈ సందర్భాల్లో చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి. వంట చేయడానికి ముందు తర్వాత భోజనం చేసే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, బిడ్డ డైపర్ మార్చిన తర్వాత, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకునే ముందు తర్వాత, దగ్గిన లేదా తుమ్మిన తర్వాత, ముక్కు శుభ్రం చేసిన తర్వాత, చెత్తను తాకిన తర్వాత, పెంపుడు జంతువులను లేదా వాటి ఆహారాన్ని తాకిన తర్వాత, గాయానికి కట్టు కట్టే ముందు తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.

బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు ఈ అలవాటు ఎందుకు నేర్పాలి?

పిల్లలు పాఠశాలలు, ఆటస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. అందువల్ల వారికి సూక్ష్మక్రిములు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే సరైన విధంగా చేతులు కడుక్కునే అలవాటు నేర్పిస్తే జలుబు, ఫ్లూ, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి అనేక వ్యాధులను నివారించవచ్చు.

సాధారణంగా చేసే తప్పులు

చేతులు కడుక్కునేటప్పుడు చాలామంది ఈ తప్పులు చేస్తుంటారు. కేవలం నీటితో మాత్రమే చేతులు కడుక్కోవడం. 20 సెకన్ల కంటే తక్కువ సమయం చేతులు కడుక్కోవడం. గోళ్ల కింది భాగాన్ని శుభ్రం చేయకపోవడం. మురికిగా ఉన్న తువ్వాలను ఉపయోగించడం. శానిటైజర్ వాడిన వెంటనే చేతులు కడుక్కోవడం. చేతులు పూర్తిగా ఆరకముందే ఆహారాన్ని తాకడం.. ఇవి చేయడం వల్ల ప్రమాదాలను మరింత ఆహ్వానించడమే అవుతుంది. చేతులు కడుక్కోవడం అనేది చాలా చిన్న అలవాటుగా కనిపించినప్పటికీ, అనేక అంటువ్యాధులను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ జీవితంలో సరైన సమయంలో, సరైన విధంగా చేతులు కడుక్కోవడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.