Reading Time: 2 minutes

ఆగస్టు 15 నుంచి   గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు.. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు

Caption of Image.

 

  • అగ్రిగేటర్ల నుంచి 1 – 2%   వెల్ఫేర్ ఫీజు
  • రూల్స్ ఉల్లంఘిస్తే 50 వేల ఫైన్.. రిపీటైతే 5 రెట్ల పెనాల్టీ  
  • నిబంధనలు, గైడ్‌‌లైన్స్ ఖరారు చేసిన సర్కారు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్లాట్‌‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్ల చట్టం, -2026 నిబంధనల రూపకల్పన తుది దశకు చేరింది. ఈ చట్టం అమలు కోసం కార్మిక శాఖ వేగంగా చర్యలు చేపడుతోంది. డిజిటల్ ప్లాట్‌‌ఫారమ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల  15 నాటికి సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ‘శక్తి’ శాఖ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసింది. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది భద్రతతో పాటు అగ్రిగేటర్ సంస్థల  జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.

దీంతో దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు జరగనుంది. గిగ్ వర్కర్లు తరచూ ఎదుర్కొంటున్న వేతన కోతలు, యాప్‌‌ల ఆల్గారిథమ్స్ ఆధారిత ఆంక్షల పట్ల ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. యాప్‌‌లు, ఆల్గారిథమ్‌‌ల ద్వారా గిగ్ వర్కర్ల పేమెంట్లు నిలిపివేయడం, కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడం, అనవసర కోతలు విధించడం వంటి చర్యలకు చెక్ పెడుతూ సంస్థలు పూర్తి పారదర్శకతను పాటించాలని స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలకు మొదటి తప్పుగా రూ. 50,000 వరకు జరిమానా విధిస్తారు. ఆపై ఉల్లంఘనలు పునరావృతమైతే లేదా బకాయిలు చెల్లించకపోతే, ఆ బకాయిలపై ఐదు రెట్ల వరకు భారీ పెనాల్టీలను వసూలు చేసేందుకు చట్టపరమైన నిబంధనలను ఖరారు చేశారు.

వెల్ఫేర్ ఫీజుతో గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు  

సంక్షేమ బోర్డు నిరంతరాయంగా పని చేసేందుకు గిగ్ వర్కర్లకు భద్రతా పథకాలను అందించేందుకు అవసరమైన నిధుల సేకరణ విధానాన్ని మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్ సంస్థలు గిగ్ వర్కర్లకు చేసే ప్రతి లావాదేవీలో 1 నుంచి 2 శాతం వరకు వెల్ఫేర్ ఫీజును సేకరించి సంక్షేమ బోర్డుకు జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీల నుంచి ఈ నిధుల సేకరణను సులభతరం చేసేలా పకడ్బందీ కలెక్షన్ మెకానిజమ్‌‌‌‌ను రూపొందిస్తున్నారు. ఆ విధంగా సేకరించిన నిధుల ద్వారా కార్మికుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు  చెల్లించడం, క్లిష్ట సమయాల్లో కార్మికులకు ఆర్థిక భరోసా ఇవ్వడం, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక పథకాలు రూపొందించడం వంటి సంక్షేమ చర్యలను నిరంతరం అమలు చేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.