
సెకండియర్ మెమోలపై స్టూడెంట్ల కలర్ ఫొటోలు
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆగస్టు 15లోగా పంపిణీకి చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే మార్కుల మెమోల విషయంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ మెమోలు చిరగవు, తడవవు. అత్యంత మన్నికైన ‘నాన్ టియరబుల్’ సాంకేతికతతో కూడిన మెమోలను ఈ ఏడాది నుంచే విద్యార్థులకు అందించనున్నారు. సాధారణ కాగితంలా కాకుండా ఇవి ప్రత్యేక సింథటిక్ మెటీరియల్‌తో రూపొందడంతో, చేత్తో ఎంత గట్టిగా లాగినా చిరగవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిఏటా సుమారు 9.50 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తుండగా, అందులో సెకండియర్ పాసయ్యే సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు ఈ సరికొత్త మెమోలను అందజేయనున్నారు.
గతంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరు చేరి చాలామంది విద్యార్థుల మెమోలు తడిచి పాడయ్యాయి. ఆ సమయంలో ఇబ్బంది పడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచితంగా డూబ్లికేట్ మెమోలు అందించింది. అప్పటి నుంచి తడవని, చిరగని మెమోలను అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేసిన ఇంటర్ బోర్డు.. ఈ విద్యా సంవత్సరం నుంచి దానిని అమలులోకి తెస్తోంది. ఈ మెమోలు పొరపాటున నీటిలో తడిసినా అక్షరాలు అస్సలు చెరిగిపోవు, పేపర్ కూడా మెత్తబడదు. దీంతో విద్యార్థులు వీటిని విడిగా లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటివరకు మెమోలపై కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే ముద్రించేవారు. ఈ పాత విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించిన బోర్డు.. ఈసారి నుంచి సెకండియర్ విద్యార్థుల కలర్ ఫొటోలను మెమోలపై ముద్రించనుంది. దీనివల్ల విద్యార్థిని సులభంగా గుర్తించడంతో పాటు, నకిలీ సర్టిఫికెట్ల బెడదకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని బోర్డు భావిస్తోంది. సాధారణంగా ఈ లాంగ్ మెమోలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అందించేవారు. అయితే ప్రస్తుతం హైయర్ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ఈసారి ఆగస్టు 15 లోపే సుమారు 4 లక్షల మందికి ఈ మెమోలను అందించేలా ఇంటర్ బోర్డు వేగంగా చర్యలు చేపడుతోంది.