
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ‘వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మీ రవీందర్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ గతంలో బిఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు బేజారెత్తారని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి, కాబట్టి ఈసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇరాన్, యూఎస్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఎక్కడా క్రూడ్ ఆయిల్ కొరత లేదన్నారు. ఒకే దేశంపై ఆధారపడకుండా వ్యూహాత్మకంగా అనేక దేశాల నుంచి మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదని ఆయన చెప్పారు.
యుపిఏ హయాంలో మన దేశం కేవలం 16 దేశాల నుంచి మాత్రమే ఆయిల్ దిగుమతి చేసుకునేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడి ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచారని ఆయన వివరించారు. మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు.. దేశంలో తగినంత బఫర్ స్టాక్ ఉందని, దిగుమతి కవరేజ్ కూడా పెరిగిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ యుద్ధం జరిగినా మన దేశ చమురు నిల్వలు, సరఫరా లేదా దిగుమతులపై ప్రభావం ఉండదని, చమురు కొరత రాదన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు 9 శాతం కంటే ఎక్కువ పెరిగినా కూడా దేశంలో ఇంధన ధరల సంక్షోభం ఏర్పడలేదని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ వ్యూహం – స్ట్రాటజిక్ నిల్వలు, విభిన్న సరఫరాదారులు, ముందస్తు ఒప్పందాల ఫలితం అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను గ్యాస్ సిలిండర్లు, ఇంధనం నిల్వ చేసుకోవాలని భయపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. చైనాతో రహస్య ఒప్పందాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి వారి ఉద్దేశాలపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రపతిని గౌరవించకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. 2012లో ఇరాన్ భారత్‌కు ఆయిల్ సరఫరా నిలిపివేయడానికి కారణం 2005లో యూపీఏ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఇఏ)లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం అని ఆయన చెప్పారు. ఆ నిర్ణయం భారత్-ఇరాన్ సంబంధాలను దెబ్బతీసిందని, దీంతో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై తీవ్రంగా ప్రభావం చూపించాయని రాంచందర్ రావు విమర్శించారు.