Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ములుగు జిల్లా పట్ల గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక అభిమానం చూపించారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుర్తు చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు సార్లు ములుగు నియోజకవర్గంలో పర్యటించడం మాత్రమే కాకుండా, కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ములుగు ప్రజలు జిష్ణుదేవ్ వర్మను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. లోక్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులను మంత్రి సీతక్క ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ దంపతుల యోగక్షేమాలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అవుతున్న వార్త తమకు ఆశ్చర్యం కలిగించిందని, ఇది తమను షాక్‌కు గురిచేసిందని మంత్రి తెలిపారు. తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యంగా కారంపొడి మిల్లు, పసుపు మిల్లు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో పలు మౌలిక వసతులను కల్పించి మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచారని, అందుకు ములుగు ప్రజలు రుణపడి ఉంటారని సీతక్క చెప్పారు.

గవర్నర్ ఇచ్చిన ప్రోత్సాహంతో కొండపర్తి గ్రామ మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వు లడ్డూలు తయారీని ఉపాధిగా చేపట్టారని మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈ లడ్డూలను విక్రయించి మహిళలు మంచి ఆదాయం పొందారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మంత్రి సీతక్క వివరించగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు అరగంటకుపైగా మంత్రి సీతక్కతో గవర్నర్ దంపతులు ఆసక్తిగా మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గవర్నర్‌కు సమ్మక్క-సారలమ్మ జాతర జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ సతీమణికి తెలంగాణ సంప్రదాయ చీరను బహుకరించారు.