Reading Time: < 1 minute

 హైదరాబాద్: పోర్న్ వీడియోలు చూసే వారికి గీత సారాంశం ఎలా తెలుస్తుందని టిటిడి మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రశ్నించారు. భ‌క్తి అంటే భామ పూజ‌.. భ‌జ‌న అంటే వంట గ‌దిలో జంట విన్యాసం అనే వ్య‌క్తికి భ‌గ‌వ‌ద్గీత‌లో మొద‌టి రెండు అక్ష‌రాలే అర్థం అవుతాయని చురకలంటించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భ‌గ‌వ‌ద్గీత పుస్త‌క ప్ర‌చుర‌ణ ఖ‌ర్చు కేవ‌లం రూ.3.71 కోట్లు అని ప్రోసీడింగ్స్ బ‌య‌టపెట్టాడు. రూ.50 కోట్లు ఎలా ఖ‌ర్చు చేశార‌ని, స్కామ్ జ‌రిగింద‌ని ఆరోపణలు చేశారు. అధికారిక పత్రాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఆమోదిత వ్యయం సుమారు రూ.3.71 కోట్లు మాత్రమేనని, మొదటి దశలో ముద్రించిన 52.95 లక్షల పుస్తకాల ఖర్చు రూ.1,99,81,250 (సుమారు ₹2 కోట్లు) అని, అయితే రూ.50 కోట్లు అనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది అని భూమన ప్ర‌శ్నించారు. ఈ పుస్త‌కంలో భ‌గ‌వ‌ద్గీత సారం లేద‌ని చెప్పిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని, భ‌గ‌వ‌ద్గీత పుస్త‌క ప్ర‌చుర‌ణ‌కు రూ.50 కోట్లు ఖ‌ర్చు అయ్యింటే రాజ‌కీయాల నుంచి విర‌మిస్తానని సవాల్ విసిరారు. భ‌గ‌వ‌ద్గీతపై కూడా త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తారా అని నిలదీశారు. ‘మా విలువ త‌గ్గ‌దని, మీ ప‌త‌నం పాతాళానికి దిగ‌జారుతుంది, మీ బుర్ర‌లో తొర్ర‌లు లేక‌పోతే భ‌గ‌వ‌ద్గీత అర్థం అవుతుంది’ అని విమర్శించారు. అర్హ‌త లేనివాడు అంద‌లం ఎక్కితే  వందిమాగ‌దులు వంద‌మాది కావాల‌న్నట్లుగా బిఆర్ నాయుడి తీరు ఉందని భూమ‌న విమర్శించారు.