Reading Time: < 1 minute

దుబాయ్: ఇరుగుపొరుగుదేశాలపై తమ దేశ క్షిపణి, డ్రోన్ దాడుల పట్ల ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్‌కియాన్ విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరుతున్న ట్లు శనివారం ప్రకటించారు. ఇకపై ఈ దేశాలపై తమ నుంచి దాడులు ఉండబోవని, అయితే తమపై దాడులకు దిగితే ఊరుకునేది లేదని తెలిపారు. ఏది ఏమైనా తమ దేశం నుంచి వారిపై ముందుగా దాడులు జరగబోవని తేల్చిచెప్పారు. ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణ తమ తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశ రాజకీయ నాయకత్వానికి సైనిక బలగాలపై పూర్తి స్థాయి అదుపు లేకపోవడం కూడా ఒక కారణమని పరోక్షంగా వివరించారు. అ మెరికా, ఇజ్రాయెల్‌తో ప్రస్తు త పోరు దశలో పరిస్థితి పలు మలుపులు తిరగడం, చివరికి పక్కదేశాలపై కూడా తమ సేనలు విరుచుకుపడటం తప్పడం లేదన్నారు.

రాత్రంతా ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్‌లో 41 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో 41 మంది చనిపోయారు. నబి చిట్ పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి జరిగిన దాడులలో మృతులు, క్షతగాత్రుల గురించి లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. శనివారం ఉదయం నుంచే తిరిగి దాడులు సాగాయి. లెబనాన్‌లోని స్థానిక సాయుధ గ్యాంగ్‌ల నిర్మూలనకు ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది.

ఇజ్రాయెల్ దాడులలో ముగ్గురు సైనికులు కూడా ఉన్నారని లెబనాన్ సైన్యం ప్రకటించింది. ఇక్కడి నిషేధిత మిలిటెంట్ల వెలికితీత పేరిట ఇజ్రాయెల్ తమ ప్రాంతంలో విచక్షణారహిత దాడులకు దిగుతోందని స్థానికంగా విమర్శలు వెలువడ్డాయి. అయితే ఇక్కడి సాయుధ ముఠాలు చివరికి లెబనాన్ భద్రతకే ముప్పుగా మారినందున ఇప్పటి తమ దాడులు సమర్థనీయమే అని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తెలిపాయి.