Reading Time: 2 minutes

గణపతి సహా అజాతంలోని మావోయిస్టులందరికీ సిఎం రేవంత్ అభయం

లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు..  నిమ్స్‌లో మెరుగైన చికిత్స

హోదాను బట్టి రివార్డు ప్రోత్సాహంలో ఉదారంగా వ్యవహరిస్తాం

ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

భూముల కేటాయింపు విషయంలో ఇప్పుడేం చెప్పలేం

రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తాం

మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తామంటే స్వాగతిస్తాం

పెద్దఎత్తున మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోవడం ఇదే తొలిసారి

130 మంది మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో ముఖ్యమంత్రి 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో హింసకు తావు లేదని, ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాసమస్యలు పరిష్కరించుకుందామని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన 130 మావోయిస్టులు, 124 ఆయుధాలతో శనివారం రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో లొంగిపోయారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన పిలుపు మేరకు ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోయారన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వారికి ఆర్థిక, ఇతర వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను సిఎం అభినందించారు. శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనదని, బ్రిటిష్ వాళ్లను సైతం అహింసతో ఎదుర్కొన్న గాంధీ సిద్దాంతాలతో దేశం నడుస్తోందని చెప్పారు.

శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారమని సిఎం తెలిపారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్న పరిస్థితి ఈ రోజుల్లో ఉందన్నారు. అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సిఎం పిలుపునిచ్చారు. లొంగిపోతే సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదని సిఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఇటీవల లొంగిపోయిన దేవ్ జీ, దామోదర్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు కొన్ని ప్రతిపాదనలు ఉంచారని వాటన్నింటీ సాధ్యమయినంత మేరకు అమలు చేస్తామన్నారు. మావోయిస్టులకు సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రతి అంశం పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యహరిస్తోందని, లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామన్నారు.

రివార్డు పెంపుపై ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు. మావోయిస్టుల ప్రతిపాదనలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని, వారి విషయంలో రాష్ట్రానికి పూర్తి స్వేచ్చనిచ్చినట్లు సిఎం చెప్పారు. రాష్ట్ర చర్రితలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల పట్ల సానుకూల వైఖరికి నిదర్శనమని సిఎం పేర్కొన్నారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని జనజీవన స్రవంతిలోకి వచ్చిన అందరికి సిఎం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రభుత్వంపై నమ్మకంతో మిగిలి వారందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సిఎం పిలుపు నిచ్చారు.

రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తాం: సిఎం

లొంగిపోయిన మావోయిస్టులపై రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర కమిటీలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ పునర్నించుకొవడంలో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు. ఎత్తివేసే అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తామని, తీవ్రమయిన నేరాలు ఉన్న కేసులు కూడా ఎత్తివేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోవని, వ్యక్తులు, వారిపై ఉన్న నేరాల తీవ్రతను బట్టి పరిశీలిస్తామని సిఎం చెప్పారు. లొంగిపోయన వాళ్లు రాజకీయాల్లో వస్తామన్నా స్వాగతిస్తామని, వారందరికి గౌరవంగా, స్వేచ్చగా బ్రతికే హక్కు ఉందని, అందుకోసం ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తుందని పునరుద్ఘాటించారు. సీతక్క లాంటి వాళ్లు రాజకీయాల్లో వచ్చి ప్రజా సేవ చేస్తున్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు.