
చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న
ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి
రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్ చిత్రాలకు అవార్డుల పంట
ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘గద్దర్ ఫిలిం అవార్డులు 2025’ విజేతల జాబితాను ప్రకటించారు. జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ అవార్డుల విజేతల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించగా, విలక్షణ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు దక్కింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్‌కు, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వినీదత్‌కు, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్‌కు, కాంతారావు అవార్డు ఆర్. నారాయణ మూర్తికి ప్రకటించారు. ఈ సంవత్సరం మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డులను అందజేస్తున్నట్లు జ్యూరీ వెల్లడించగా, కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేక పురస్కారాలతో పాటు డాక్టర్ సినారే, ఏఎన్‌ఆర్ పేర్లతో అవార్డులను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాలను నామినేషన్లకు ఎంపిక చేశారు.
చిన్న చిత్రాలకే ఎక్కువ అవార్డులు..
‘తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డులు’ ప్రధాన కమిటీ అధ్యక్షునిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు,- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి చైర్మన్‌గా ఉన్నారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ ఏడాది గద్దర్ అవార్డులు ఎక్కువశాతం చిన్న చిత్రాలకే దక్కాయి. రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్ చిత్రాలు ఎక్కువగా అవార్డులకు ఎంపికకావడం విశేషం. గద్దర్ అవార్డులలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్రం ద్వారా సాయిలు కంపాటి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు.
ఉత్తమ నటునిగా ‘తండేల్’ కథానాయకుడు నాగచైతన్య, ఉత్తమ నటిగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ నాయిక రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఉత్తమ సహాయనటులు కేటగిరీలో ‘దండోరా’ నుండి శివాజీ, ’యుఫోరియా’ ద్వారా భూమిక విజేతలుగా నిలిచారు. ఉత్తమ హాస్య నటుడిగా ‘జిగ్రీస్’లో నటించిన కృష్ణతేజ రెడ్డి, ఉత్తమ బాల నటుడిగా ’ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో నటించిన మాస్టర్ రోహన్ నిలిచారు. ఇక ఉగాది రోజు మార్చి 19వ తేదీన ’తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డులు’ వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనుంది.
స్పెషల్ అవార్డులు..
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ః చిరంజీవి
నాగిరెడ్డి-, చక్రపాణి అవార్డు ః అశ్వినీదత్
బీఎన్‌రెడ్డి అవార్డు ః సింగీతం శ్రీనివాసరావు
పైడి జయరాజ్ అవార్డు ః కమల్‌హాసన్
అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ అవార్డు ః జయసుధ
సి.నారాయణ రెడ్డి అవార్డు ః సుద్దాల అశోక్ తేజ
రఘపతి వెంకయ్య అవార్డు ః రమేష్‌కు ప్రసాద్
కాంతారావు అవార్డు ః ఆర్. నారాయణమూర్తి