
టి-20 ప్రపంచకప్‌లో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దగ్గం సునీల్ గవాస్కర్ మన ఆటగాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
అక్షర్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప క్రికెటర్ అవుతాడని గవాస్కర్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతడి ఫీల్డింగ్ అద్భుతమని కొనియాడారు. ‘‘బ్రూక్‌ను ఔట్ చేసే క్రమంలో అక్షర్ పట్టుకున్న క్యాచ్ నమ్మశక్యంగా లేదు. మ్యాచ్‌ను దూరం చేసే సత్తా ఉన్న హ్యారీ బ్రూక్‌ని ఔట్ చేసేందుకు తన ఫీల్డింగ్ చేస్తున్న స్థానం నుంచి ఎడమవైపు 24 మీటర్ల దూరం పరుగెత్తి.. తనను తాను నిభాయించుకుంటూ అక్షర్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. అలాగే విల్ జాక్స్‌ను ఔట్ చేయడంలోనూ అతడిదే ప్రధాన పాత్ర. భారత్ నుంచి బెతెల్-జాక్స్‌ల జోడీ మ్యాచ్‌ని దూరం చేస్తున్న సమయంలో అక్షర్ గొప్ప ఫీల్డింగ్‌తో క్యాచ్ అందుకొని మ్యాచ్‌ను మరోసారి మలుపు తిప్పాడు. అత్యున్నత స్థాయిలో ఉత్తమ ఆటగాళ్లకు అత్యుత్తమ ఆటగాళ్లకు తేడా ఇదే. అక్షర్ భారత్‌కు అత్యుత్తమ ఆటగాడు అవుతాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని అక్షర్ భర్తీ చేస్తున్నాడు’’ అని గవాస్కర్ కొనియాడారు.
ఇక పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై కూడా గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘బుమ్రా తరానికొక్కడు కాదు.. శతాబ్ధానికి ఒకడు. అతడి లాంటి బౌలర్ అరుగా వస్తుంటాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లూ ఆడుతాడు. ఫార్మాట్ ఏదైనా బంతి ఇస్తే.. సానుకూల ఫలితాన్ని రాబడతాడు. అరుదుగా మాత్రమే ఎక్కువ పరుగులు ఇస్తాడు. ఎందుకంటే అతడు కూడా మనిషే. కానీ, అవసరం ఉన్నప్పుడు గట్టిగా నిలబడతాడు. మిగిలిన బౌలర్లు 15-20 పరుగులు ఇస్తున్న సమయంలో 7-8 పరుగులే ఇవ్వడం బుమ్రా ప్రత్యేకత’’ అని గవాస్కర్ అన్నారు.